బహిష్కరణకు గురైన సుబ్బారావు కుటుంబం
సాక్షి,పెదపూడి: మండలంలోని పైన గ్రామంలో ఓ కుటుంబంపై సాంఘిక బహిష్కరణ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉలిసే సుబ్బారావు, అతని కొడుకు సాయిరామ్, కుమార్తె, భార్య నివసిస్తున్నారు. బాధితుడు సుబ్బారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో రామాలయం సమీపంలో తమ నివాస గృహం ఎదురుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ పెద్దలు సిమెంటు రోడ్డు నిర్మించారు. అ రోడ్డు నిర్మాణ విషయంలో సుబ్బారావు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అయినా సరే స్థానిక పంచాయతీ పెద్దలు కొంత మంది రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ విషయంపై బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన గ్రామంలో కొంతమంది పెద్దలు బహిష్కరణ వేటు వేశారు. గ్రామ మాజీ సర్పంచి మట్టపర్తి వీరభద్రరావు, తదితరులు తమపై కావాలనే ఇలా బహిష్కరణ చేసినట్లు ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామంలో ఏ వస్తువు కొనాలని వెళ్లినా, తమకు సహకరించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వెళితే ‘మీకు అమ్మకాలు జరపబోమని’ విక్రయదారులు చెబుతున్నారని ఆయన వివరించారు. ఒకవేళ పంచాయతీ పెద్దలను కాదని వస్తువులను అమ్మితే రూ.6 వేలు జరిమానా విధిస్తారని పెద్దలు విక్రయదారులకు హెచ్చరించారంటూ బాధితుడు వివరించారు. ఈ బహిష్కరణ విషయమై గతంలో పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
బహిష్కరించలేదు
ఉలిసే సుబ్బారావు కుటుంబాన్ని బహిష్కరించలేదు. రామాలయం వద్ద దేవుని కార్యక్రమాలు చేయడానికి ఆ ప్రాంతంలో గ్రామ పెద్దల అందరి సమక్షంలో సీసీరోడ్డు నిబంధనల ప్రకారం చేపట్టాం. ఎలాంటి ఆక్రమణాలు చేయలేదు.
– మట్టపర్తి వీరభద్రం ,మాజీ సర్పంచి
Comments
Please login to add a commentAdd a comment