పాలమూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, రక్తహీనతతో గ్రామీణులు మంచం పట్టాల్సి వస్తోంది. పారిశుధ్య లోపం వల్ల విస్తరిస్తున్న దోమలతో డెంగీ సోకి జనం అవస్థ పడుతున్నారు. ఇంతవరకు 400మంది పైగా డెంగీ, విషజ్వరాల బారినపడ్డారు. వైద్యాధికారులు నిర్ధారించిన ప్రకారం 255 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో కేవలం పదిమందికి మాత్రమే డెంగీ ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 32 మందికి చికున్‌గున్యా, 37 మందికి మలేరియా సోకినట్లు వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. దాదాపు మూడు వేల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా డెంగీని ముందస్తుగా గుర్తించేందుకు జిల్లాలోని ఆస్పత్రుల్లో ల్యాబ్‌లు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఐడీఎస్పీ ల్యాబ్ మాత్రమే శరణ్యం. ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా బయట నిర్ధారణ పరీక్షలు చేయాలంటే రూ.4 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పేదలు పరీక్షలు చేయించుకునేందుకు జంకుతున్నారు. మరోవైపు నిధుల లేమీ, మందుల కొరత, వైద్య సిబ్బంది ఖాళీల భర్తీ పట్ల ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసింది. ఫలితంగా గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. వివిధ వ్యాధులతో వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. వ్యాధులు తగ్గుముఖం పట్టకపోవడం, తరచూ మరణాలు సంభవించడం మారుమూల ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని పీహెచ్‌సీల్లో నామమాత్రంగా చికిత్స చేస్తున్నారు. దీంతో మలేరియా కేసుల సంఖ్య వెలుగు చూడటం లేదు.
ప్రైవేటు దోపిడీ...
చిన్నపాటి అనారోగ్యాలకు కూడా పెద్దవిగా చూపి పరీక్షల పేరుతో కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోగుల నుంచి డబ్బులు దండిగా దోచుకుంటున్నారు. ఖర్చుతో కూడిన పరీక్షలు చేయించుకునేందుకు పేద కుటుంబాలకు చెందిన వారు అప్పులపాలు కావాల్సి వస్తోంది. డెంగీ బారిన పడిన వారితో ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు.
అత్యవసర వైద్యుల కొర త...
జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రితో పాటు ఇతర వైద్యాలయాల్లో అత్యవసర సమయంలో ఆపరేషన్‌లు చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల్లేని కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. నాగర్‌కర్నూల్, వనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల్లేని కారణంగా చాలాకాలంగా ఆపరేషన్ థియేటర్లు మూతబడ్డాయి.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు వివిధ వ్యాధులకు సంబంధించి వైద్యాధికారులు నమోదు చేసిన వివరాలు...
మంచం పట్టిన పల్లెలు
Published Sat, Sep 28 2013 2:59 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement