జనరల్ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేస్తున్న వైద్య బృందం
ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి నుంచి తప్పించి.. ప్రతీఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తూ.. ఎందరో మన్ననలు పొందుతూ.. ఉమ్మడి జిల్లాలోని పేదలకు పెద్దదిక్కుగా మారింది జిల్లా జనరల్ ఆస్పత్రి. మూడు విభాగాల్లో వైద్యం అందించే స్థాయి నుంచి.. కాలానుగుణంగా అత్యాధునిక సీటీస్కానింగ్, డిజిటల్ ఎక్స్‌రే, అన్ని రకాల ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆస్పత్రి ఏర్పడి నేటికీ మూడేళ్లు పూర్తయింది.
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దవాఖానాకు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రతీ సంవత్సరం 150 సీట్ల చొప్పున ఎంసీఐ నుంచి గత నాలుగు సంవత్సరాలుగా అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సులో 178 సీట్లకు అనుమతి వచ్చింది. ఆస్పత్రిలో మొదట్లో 350 పడకలతో ప్రారంభమై, ప్రస్తుతం 650 పడకలతో రోగులకు సేవలు అందజేయడం జరుగుతుంది. త్వరలో రెండు నుంచి మూడు నెలల్లో తొమ్మిది వందల పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మధ్యే ప్రత్యేకంగా ఎంసీహెచ్ బిల్డింగ్, ట్రామా కేర్ బిల్డింగ్, ఆధునిక తెలంగాణ డయోగ్నస్టిక్స్ ల్యాబ్ బిల్డింగ్, ఆధునిక లేబర్ రూమ్, 20 పడకల ఐసీయూతో పాటు పాలియేటివ్ డే కేర్ సెంటర్, తలసేమియా డే కేర్ సెంటర్, హీమోఫీలియా డే కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్, క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ మొదలైన సౌకర్యాలతో పాటు వైద్య కళాశాల ఏర్పడటం మూలంగా ఈఎన్‌టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఫోరెన్సిక్, జనరల్ సర్జరీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, రేడియాలజీ విభాగాలు పని చేస్తున్నాయి.
అన్ని రకాల సేవలు మెరుగు
గతంలో వైద్యవిధాన పరిషత్‌లో ఈ ఆస్పత్రిలో క్యాజువాలిటీ, స్త్రీ సంబంధ వ్యాధులు, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, బ్లడ్ బ్యాంక్, డెంటల్ సైన్సెస్ లాంటి విభాగాలు మాత్రమే పని చేసేవి. జనరల్ ఆస్పత్రి ఏర్పాటు తర్వాత 16విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం సగటున ప్రతి రోజూ 1,600 నుంచి 1,800 మంది ఓపి చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది 1,32,518 మంది దవాఖానాలో అడ్మిషన్ పొంది చికిత్స తీసుకున్నారు. అదేవిధంగా 12,63,480 మంది ఓపీ సేవలు పొందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 27,770 మందికి ప్రసవాలు చేయగా, 67,524 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేశారు. 15,52,259 మంది వివిధ రకాల లాబొరేటరి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 5,70,674 రోగులు బయోకెమిస్ట్రీ, 6,12,996 రోగులు పాథాలజీ, 21,6245 రోగులు మైక్రోబయాలజీ పరీక్షలు చేయించుకున్నారు. రేడియాలజీ విభాగంలో 92,730 మంది ఎక్స్ రే సేవలు, 92,623 మంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు, 49,586 మంది ఈసీజీ సేవలు, 19,690 మంది సిటీ స్కాన్ సేవలు పొందారు.
గతంలో మూడు విభాగాలే
జిల్లా ఆస్పత్రి ఉన్న సమయంలో కేవలం మూడు విభాగాలు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ మాత్రమే అందుబాటులో ఉండేవి. జనరల్ ఆస్పత్రి ఏర్పాటు తర్వాత 16విభాగాలు అందుబాటులోకి వ చ్చాయి. దీంట్లో కీలక విభాగాలు పని చేస్తున్నాయి. ము ఖ్యంగా మూడు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసుకు న్నాం. ప్రస్తుతం 650పడకలతో సేవాలు అందుతున్నాయి మరో రెండు నెలల్లో 900పడకలకు పెంచుతున్నాం.100పడకలకు అవసరమైన ఆక్సిజన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. క్యాజువాలిటీలో 25పడకలకు పెంచాం. గతంలో నిత్యం ఓపీ 400వరకు ఉంటే ప్రస్తుతం 1800పైగా ఉంటుంది. అదేవిధంగా 500నుంచి 600మంది రోగులు ఆడ్మిట్‌లో ఉంటున్నారు.– డాక్టర్ రామకిషన్,జనరల్ ఆస్పత్రి సూపరిటెండెంట్
అత్యాధునిక పరికరాలు
డెంగీ రోగగ్రస్తులు త్వరగా కోలుకోవటానికి ప్లేట్ లెట్స్‌లను ఓకే దాత నుంచి గ్రహించటానికి రూ.30 లక్షల విలువైన ఎస్డీపీ (సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ )మెషిన్ అందుబాటులో ఉంది. ప్లేట్ లెట్స్ అందించే ఈ ప్రక్రియలో రోగులకు రూ.30 వేల విలువ చేసే కిట్ ఉపయోగిస్తారు. దవాఖానాలో గల డయాలసిస్ కేంద్రంలో 10,271 సార్లు వివిధ మూత్రపిండాల వైఫల్య రోగులు డయాలసిస్ సేవలు పొందారు. పాలియేటివ్ డే కేర్ సెంటర్ లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అయినా 7,498 మందికి గత మూడు సంవత్సరాలుగా సేవలు పొందుతున్నారు. తలసేమియా వ్యాధికి 180 మంది రోగులు రక్త మార్పిడి చేయించుకుని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అదేవిధంగా హిమోఫీలియా వ్యాధికి 266 మందికి ఖరీదైన వైద్యం పేదలకు అందుబాటులోనికి వచ్చింది. పాముకాటుకు 1,141 మంది వైద్య సేవలు పొంది మెరుగయ్యారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే చనిపోయినారు. కుక్కకాటుకు 10, 829 మంది రెబిస్ రాకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment