నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపంతో చిన్నారులు ‘చిక్కి’పోతున్నారు. దీంతో రోజూ జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేసిందే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ (అక్షయ పిల్లల ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రం). ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నా చిన్నారులు లేక వెలవెలపోతున్నది. ఈ కేంద్రం గురించి అధికారులు ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధపడుతూ మరణించకూడదనే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఏడాది సెప్టెంబర్ 5న ఎన్‌ఆర్‌సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో 20 పడకల సామర్థ్యంతో ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్‌లు సరైన ప్రచారం నిర్వహించని కారణంగా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా నేటికి వైద్యం కోసం ఆశించిన స్థాయిలో చిన్నారులను తల్లిదండ్రులు తీసుకురావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 105 మంది చిన్నారులు మాత్రమే కేంద్రంలో వైద్యసేవలు పొందారంటే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో స్పష్టమవుతోంది.
ఉచిత వైద్యసేవల విషయం తెలియని తల్లిదండ్రులు
అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించే ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎన్‌ఆర్‌సీలో ఉచితంగా వైద్యసేవలు అం దించడంతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తారనే సమాచారం చిన్నారుల తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుందని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంల బాధ్యత ఏమిటంటే..
అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు కలిసి ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు పోషకాహార దినాన్ని నిర్వహించాలి. ఈ సందర్భంగా చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారా, చెయ్యి చుట్టు కొలత 11.5 సెంటి మీటర్లుకు తక్కువగా ఉందా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంది. పౌష్టికాహారంతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. గుర్తించిన చిన్నారులను వైద్యం కోసం ఎన్‌ఆర్‌సీ సెంటర్‌కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించాల్సిన బాధ్యత ఉంది.
అదే విధంగా చిన్నారులను సెంటర్‌కు తీసుకువచ్చి చేర్పిస్తే ఆశ వర్కర్‌కు రూ.50 పారితోషికం అందిస్తారు. కానీ సంబంధిత బాధ్యులు వాటిని ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడం.. ఎన్‌ఆర్‌సీ గురించి ప్రజలకు తెలియకపోవడంతో చిన్నారులను వైద్యం కోసం తీసుకురాని పరిస్థితి. దీనిపై సంబంధిత అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు సమన్వయంతో వ్యహరించి పౌష్టికాహారంతో బాధపడే వారిని గుర్తించి ఎన్‌ఆర్‌సీలో చేర్పించి వారికి ప్రాణం పోయాలని కోరుతున్నారు.
పునరుజ్జీవమెలా?
Published Sun, Sep 8 2013 4:17 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement