గుక్కెడు నీటికోసం మైళ్ల దూరం నడక. ఒక రోజు రెండు రోజులు కాదు.. ఏళ్లకాలంగా ఇదే సమస్య. పాలకులు స్పందించి ఒకడుగు ముందుకు వేసినా అధికారులు అలసత్వాన్ని వీడటం లేదు. మంచినీటి పథక నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదు. శిలాఫలకం వెక్కిరిస్తూ కనిపిస్తోంది.
కల్వకుర్తి, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దాహం తీరడం లేదు. దశాబ్దాలుగా వీరు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొంతు తడుపుకునేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో శాశ్వత తాగునీటి సరఫరా కోసం రూ. 100 కోట్ల నిధులు మంజూ రు చేశారు. ఈ సంవత్సరం మార్చిలో కల్వకుర్తిలో మంచినీటి పథకానికి ఆయ న శంకుస్థాపన చేశారు. అయితే పది నెలలు పూర్తి కావస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
లక్ష్యం ఇదీ..
శాశ్వత తాగునీటి కోసం మంజూరైన రూ. 100 కోట్ల నిధులతో నిర్మాణ పనులు పూర్తి చేస్తే.. కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి మండలాల పరిధిలోని 194 గ్రామాలకు మంచినీరు అందనుంది. అలాగే 1.46 లక్షల మంది ప్రజల దాహార్తి తీరనుంది. ఈ పథకానికి మొదట సాగర్ రోడ్డులోని గోడకొండ జలాశయం నుంచి నీటిని తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే కెఎల్‌ఐ(కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం) జలాశయం నుంచి నీటిని తీసుకురావడం మరింత సులువవుతుందని అధికారులు నివేదిక రూపొందించారు.
ఇందుకు విరుద్ధంగా జీవోలో మంచినీటిని రామన్‌పాడ్ నుంచి తీసుకురావాలని సూచించారు. అయితే ఈ నీరు కెఎల్ మొదటి ఎత్తిపోతల సింగోటం వద్ద ఎల్లూరు రిజర్వాయర్ నుంచి రానున్నాయి. జీవోలో ఎల్లూరు పేర్కొనడానికి ముందుగా అనుమతిలేదు. ఆ చిన్న సమస్యతో నిధులు ఆగిపోతాయని భావించి రామన్‌పాడ్ పేర్కొన్నట్లు స్థానిక నేతలు గతంలో పేర్కొన్నారు.
ఇదీ సమస్య..
రామన్‌పాడ్ నుంచి ఇప్పటికే జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జడ్చర్ల పరిధిలోని గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రజలకు మంచినీరు సరఫరా అవుతోంది. ఆ ప్రాంతాలకే సరఫరా చేయడం క ష్టంగా మారింది. దీంతో రామన్‌పాడ్ నుంచి మరో ప్రతిపాదన పెడితే నిధులు వృథా అవుతాయి. ఎల్లూర్ రిజర్వాయర్‌కు 1.87 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఇక్కడి నుంచి 365 రోజులు మంచినీరు సరఫరా చేయవచ్చు.
ఈ మూడు మండలాలకు ఏడాది పాటు 0.05 టీఎంసీల నీరు సరిపోతుంది. సమస్య తీవ్రతను స్థానిక నేతలు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయారు. కేంద్రమంత్రి ఈ విషయాన్ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డితో చర్చించి అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన సంబంధిత మంత్రి అనుమతులకు ఒప్పుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అనుమతి పత్రం పంచాయతీ శాఖకు అప్పగించారు. అయితే సర్వే పనులు ఇంకా ప్రారంభం కాలేదు..
నిర్మాణం ఇలా..
ఎల్లూరు జలాశయం నుంచి కల్వకుర్తి 80 కి.మీ.దూరంలో ఉంది. పైపుల ద్వారా 130 మీటర్ల ఎత్తు(400 అడుగులు)కు నీటిని పంపింగ్ చేయాలి. నీటిశుద్ధి కేం ద్రం ఎక్కడ నిర్మించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎల్లూర్ సమీపంలోనే ఏర్పాటు చేస్తే, ఇక్కడికి తక్కువ సామర్థ్యం గల పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేయవచ్చని భావిస్తున్నారు. కల్వకుర్తిలో పెద్ద ట్యాంక్ నిర్మించి, వెల్దడ, తలకొండపల్లి మండలాలకు నీటిని పంపింగ్ చేస్తారు. ఎత్తయిన ప్రదేశంలో 1.20 లక్షల సామర్థ్యం గల ట్యాంక్‌లను వెల్దండ, తలకొండపల్లి మండలాల్లో ఏర్పాటు చేస్తారు.
మైళ్లదూరం నడక..
కల్వకుర్తి పట్టణంలో 40వేల జనాభా ఉం ది. తాగునీటి అవసరాలకు వీరంతా ట్యాం కర్లపై ఆధారపడ్డారు. అలాగే వెల్దండ, తల కొండపల్లి గ్రామాల ప్రజలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఎండాకాలంలో వీరి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. పనులు వదులుకొని మంచినీటి కోసం ప్రయాస పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
దప్పిక తీర్తలేదు..
Published Wed, Dec 18 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement