నెల్లూరుకు కన్నీళ్లు | Nellore, tears | Sakshi
Sakshi News home page

నెల్లూరుకు కన్నీళ్లు

Published Wed, Jan 8 2014 5:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Nellore, tears

 సాక్షి, నెల్లూరు: కండలేరు ద్వారా నీటిని చిత్తూరుకు తరలించి జిల్లా వాసులకు కన్నీళ్లను మిగల్చడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చిత్తూరు జిల్లాకు తాగు, సాగునీటిని అందించే సాకుతో సోమశిల ఆయకట్టు ప్రయోజనాలను అధికారులు, ప్రజాప్రతినిధులు బలిపెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సోమశిలకు 62 టీఎంసీలకు పైగా నీరు చేరింది. దీంతో డెల్టాతో పాటు నాన్‌డెల్టాకు సంబంధించి కావలి, కనుపూరు కాలువ పరిధిలోని రైతుల కష్టాలు పడకుండా పండించుకోవచ్చని సంతోషించారు.
 
 సుమారు 35 టీఎంసీల నీటిని కండలేరుకు తరలించడం విమర్శలకు తావిస్తోంది. చెన్నైకి తాగునీటి అవసరాలకే కాక సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించేందుకు అధికారులు కండలేరుకు నీళ్లను తరలించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నీళ్లు సోమశిలలోనే ఉంటే మొదటి పంటతో పాటు రెండో పంటకు సాగునీటి ఇబ్బం దులు ఉండేవి కాదని రైతులు అంటున్నారు. మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా కండలేరుకు అధికంగా నీటి తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పంటే సక్రమంగా పండే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. నీటికష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  పెపైచ్చు  సోమశిల నుంచి చిత్తూరు జిల్లాకు 6.61 టీఎంసీలను తరలిస్తూ  కిరణ్ సర్కార్ ఆదేశాలు జారీచేయడం అంటే జిల్లా రైతాంగం కడుపుకొట్టడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు ,రైతుసంఘాలు, ప్రజాసంఘాలు ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ఖాతరు చేయని ప్రభుత్వం జిల్లాకు చెందిన మంత్రి ఆనంతో పాటు అధికార పార్టీ నేతల మద్దతుతో నీటి తరలింపునకు జీఓ విడుదల చేసింది. మరోవైపు ఎగువన శ్రీశైలం నుంచి తేవాల్సినంతగా నీటిని ప్రజాప్రతినిధులు తీసుకరాకపోగా ఉన్ననీటిని కండలేరుకు తరలించి చిత్తూరు, జిల్లాలో అధికంగా సాగు,తాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రతిరోజూ 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు కండలేరు అధికారులు పేర్కొంటున్నారు.
 
 రెండు జిల్లాల  పరిధిలో  1.72 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు  చెబుతున్నా  నెల్లూరు జిల్లా పరిధిలో కొన్ని చెరువుల మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికంగా చిత్తూరు జిల్లాకే నీటిని  తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు  78 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన సోమశిల రిజర్వాయర్ నీటిమట్టం గత పదేళ్లలో ఎన్నడూ పూర్తి సామర్థ్యానికి చేరింది లేదు. ఎన్నడూ లేని విధంగా 2013 నవంబర్ నాటికి  8.33 టీఎంసీలతో డెడ్ స్టోరేజీకి చేరింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం సహజంగానే నెల్లూరు జిల్లాపై ఉండదు. అయితే నవంబర్ తర్వాత  ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో దాదాపు 40 టీఎంసీల వరకూ కృష్ణా జలాలు సోమశిలకు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
  జిల్లాలో వ్యవసాయం దాదాపుగా  సోమశిల రిజర్వాయర్ నీటిపై ఆధారపడి ఉంది. ఇటు పెన్నా, అటు కృష్ణా జలాలతో సోమశిల నిండితేనే రిజర్వాయర్ పరిధిలో అధికారంగా దాదాపు 5 లక్షల ఎకరాలు, అనధికారికంగా 7 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టులో వరి పండుతుంది. లేకపోతే బీళ్లే. దాదాపు 50 టీఎంసీల నీళ్లు ఉంటే తప్ప పూర్తి ఆయకట్టులో ఒకపంట పండే పరిస్థితి లేదు. ఈ ఏడాది 62 టీఎంసీల నీరు సోమశిలకు చేరినా అధికారులు ఎక్కువగా కండలేరుకు తరలించారు.
 
 దీంతో సోమశిల పరిధిలో ఆయకట్టుకు నీరు సక్రమంగా చేరే పరిస్థితి లేకుండా పోయింది. చెన్నై తాగునీటి అవసరాల కోసం కండలేరుకు నీటిని తరలించాల్సిందే. ఇది ఎవరూ కాదనలేనిది. చిత్తూరు జిల్లాలో తాగు,సాగునీటి అవసరాలకు సైతం నీటిని ఇస్తున్నారు. అయితే జిల్లాలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లివ్వకుండానే కండలేరు ద్వారా చిత్తూరుకు తరలించడం ఏ న్యాయమని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కావలి, కనుపూరు కాలువల పరిధిలో ఆయకట్టు నీళ్లందక ఎండిపోతోంది. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు శ్రీశైలంలో నీళ్లున్నాయి. ఎలాగూ ప్రభుత్వం చిత్తూరుకు సోమశిల నుంచి 6.61 టీఎంసీలు తరలింపుకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రి ఆనం స్పందించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడుదల చేయించాలని, జిల్లాలో ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement