తీరప్రాంతంలో గ్రాçమసభ నిర్వహిస్తున్న అ«ధికారులు
నక్కపల్లి (పాయకరావుపేట): భూములు ఇవ్వబోమన్నా బలవంతంగా లాక్కొన్నారు.. పరిహారమైనా సంతృప్తికరంగా ఇచ్చారా అంటే అదీ లేదు.. ప్రకటించిన పరిహారం పూర్తిగా చెల్లించలేదు.. ఇప్పుడేమో ఊళ్లు ఖాళీ చేయించడానికి గ్రామాల్లోకి వచ్చారు.. ఇదెక్కడి న్యాయమంటూ నిర్వాసితులు సోమవారం తీరప్రాంత గ్రామాల్లోకి వచ్చిన రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోను గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా మండలంలో రాజయ్యపేట, చందనాడ, అమలాపురం, వేంపాడు, బోయపాడు, మూలపర, నెల్లిపూడి, డీఎల్ రం బుచ్చిరాజుపేట తదితర గ్రామల్లో ఐదు వేల ఎకరాలను సేకరిస్తోంది. ఇప్పటికే రైతుల నుంచి రెండు వేల ఎకరాలు తీసుకుంది. ఎకరాకు రూ.18 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఒప్పుకున్నారు. అన్ని లాంఛనాలు పూర్తయినప్పటికీ పరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. రూ.500 కోట్లు అవసరమైతే ప్రభుత్వం కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసి పంపిణీ చేసింది. పరిహారం చెల్లించకపోగా గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు ప్రభుత్వం చందనాడ, బుచ్చిరాజుపేట, నల్లమట్టిపాలెం, తమ్మయ్యపేట, బోయపాడు గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోంది.
తీవ్ర ప్రతిఘటన
సోమవారం ఏపీఐఐసీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పుష్పమణి, తహసీల్దార్ రాణీ అమ్మాజీ తదితరులు ఈ గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు నిర్వహించారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఇళ్లకు విలువ కట్టి యజమానికి ప్యాకేజీ చెల్లిస్తామని, పునరావాసం కల్పిస్తామని ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. సర్పంచ్ గంటా తిరుపతిరావు తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. గతంలో భూములు తీసుకుంటామన్నారని, ఇప్పుడేమో ఇళ్లు, గ్రామాలు ఖాళీ చేయిస్తామంటున్నారని నిలదీశారు. వేరే ప్రాంతాలకు వెళ్లడం తమ వల్లకాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఖాళీ చేయడం అనివార్యమయితే గ్రామస్తులంతా సమావేశమై పునరావాసంపై తమ డిమాండ్లు తెలియజేస్తామని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని డిప్యూటీ కలెక్టర్ పుష్పమణి హామీ ఇచ్చారు. బోయపాడులో మత్య్సకారులు గ్రామం ఖాళీచేయడానికి 100 డిమాండ్లు వ్యక్తం చేశారు. గ్రామాలను ఖాళీ చేయించే నిర్ణయాన్ని సీపీఎం నాయకులు వ్యతిరేకించారు. ఎం.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ గతంలో సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా, ఇప్పుడు గ్రామాలను తరలించాలని ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment