ఆలకిస్తూ.. అన్నీ చూస్తూ | VIP Reporter T.baburao Naidu Joint Collector | Sakshi
Sakshi News home page

ఆలకిస్తూ.. అన్నీ చూస్తూ

Published Sun, Nov 16 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

ఆలకిస్తూ.. అన్నీ చూస్తూ

ఆలకిస్తూ.. అన్నీ చూస్తూ

VIP రిపోర్టర్
 టి బాబూరావు నాయుడు, ఐఏఎస్
 
 ఉదయం ఎనిమిది గంటలైంది. ఏలూరు నగరం చిరు జల్లులతో ముసురుకుంది. పత్తేబాద రైతుబజార్‌లో కూరగాయల ధరలు మాత్రం మంటెక్కిపోతున్నాయి. ధరలు వింటేనే వినియోగదారుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. బయటి మార్కెట్‌లో ధరలకు రైతు బజార్‌లో ధరలకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న కూర‘గాయాల’ కష్టాలను తెలుసుకునేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారారు. రైతుబజార్‌కు వచ్చి ప్రతి దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ విక్రరుుస్తున్న కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా ఉన్నాయో వినియోగదారులు, దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ధరలు ఎందుకు పైపైకి వెళ్తున్నాయి.. అక్కడ దళారులు ఎంతమంది ఉన్నారు.. నిజమైన రైతులు ఎంతమంది.. వారి కష్టాలేమిటి.. వినియోగదారుల సమస్యలేమిటనే విషయూలను స్వయంగా తెలుసుకున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులు నష్టపోకుండా పరిష్కార మార్గాలేమిటో కనుక్కునేందుకు ‘వీఐపీ రిపోర్టర్’ ద్వారా చక్కటి అవకాశం దక్కిందని బాబూరావునాయుడు వ్యాఖ్యానించారు.
 
 బాబూరావునాయుడు : ఏమండీ.. రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయ్ ?
 
 పీపీ రాజు : చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. గతంలో ఇంత ఎక్కువ ధరలు ఎప్పుడూ చూడలేదు.
 
 జారుుంట్ కలెక్టర్ బాబూరావునాయుడు ఎస్టేట్ అధికారి నందినీ దేవితో మాట్లాడుతూ రైతు బజార్ ఉద్దేశమేమిటో తెలుసా అని ప్రశ్నించారు. అనంతరం పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్లారు. కూరగాయలు కొనేందుకు వచ్చిన బత్తిన సత్యవతితో మాట్లాడారు. చిక్కుడుకాయలు ఎంతకు కొంటున్నారని అడిగారు.
 
 సత్యవతి : రేటు చాలా ఎక్కువగా ఉంది సార్. కిలో 46 రూపాయలంట.
 చిక్కుడు కాయలు అమ్ముతున్న వ్యక్తితో జేసీ మాట్లాడుతూ ‘పంట మీరు పండిస్తున్నారా.. కొని తీసుకు వస్తున్నారా’ అని ప్రశ్నించారు.
 
 వ్యాపారి : చిక్కుడు కాయలు మా బంధువు తోటలో పెంచుతున్నారు. అతని వద్ద తీసుకు వస్తున్నాం సార్.
 
 బాబూరావునాయుడు : మరీ ఇంత ఎక్కువ రేటయితే ఎలా?
 
 వ్యాపారి : లేదు సార్.. గత వారంతో పోలిస్తే ఇప్పుడు
 
 ధర తగ్గిందని చెప్పగా, అక్కడి నుంచి జేసీ పక్కనే ఉన్న బియ్యం దుకాణం వద్దకు వెళ్లి బియ్యం ధరలపై ఆరా తీశారు.
 
 బాబూరావునాయుడు : ఇక్కడ బియ్యం ధరలు ఎలా ఉంటున్నాయ్
 
 శేఖర్ : సంతృప్తికరంగానే ఉంటున్నాయి సార్. బయటకన్నా సుమారు 6 రూపాయలు తక్కువ ధరకే బియ్యం ఇస్తున్నారు.
 బాబూరావునాయుడు : మీరు చెప్పండి. నాణ్యత ఎలా ఉంటోంది.
 
 కె.శ్రీనివాసరావు : బయటి మార్కెట్‌లో మాదిరిగానే ఉంటున్నాయ్ సార్
 
 బాబూరావునాయుడు : ధరలు తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది.
 
 యల్లపు దుర్గారావు : రైతులే డెరైక్టుగా అమ్మేలా చేస్తే ధరలు మరికాస్త తగ్గించే అవకాశముంది సార్.
 
 బాబూరావునాయుడు : ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయ్
 
 ప్రభుకుమార్ : సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయ్. బజారును మరికాస్త విశాలంగా చేస్తే బాగుం టుంది. వర్షం వస్తే బురదమయంగా మారిపోతోంది.
 
 బాబూరావునాయుడు : డ్రెరుునేజీ వ్యవస్థ ఎలా ఉంది.
 
 బెజవాడ సరమ్మ : చాలా దారుణంగా ఉంది సార్. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. ఎంతోమంది అధికారులు తనిఖీలు అంటూ వస్తున్నారు, వెళుతున్నారు కానీ.. ఇక్కడ ఏమీ చేయడం లేదు.
 
 బాబూరావునాయుడు : ‘మరుగుదొడ్లు పురుషులకు, మహిళలకు విడివిడిగా ఉన్నాయా లేదా’ అని అడిగిన ప్రశ్నకు అక్కడి వ్యాపారం చేసుకునే మహిళ లేదు సార్.. అందరికీ కలిపి అవే మరుగుదొడ్లు అని చెప్పింది. ‘అలా ఎలా పెడతారు’ అని జేసీ అని అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుండి పక్కనే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లారు.
 
 బాబూరావునాయుడు : ఇక్కడ పారిశుధ్యం ఎలా ఉంది.
 
 బత్తిన సత్యవతి : అస్సలు బాగోడం లేదు సార్. చెత్త ట్రాక్టర్ రెండు రోజులకు ఒకసారి వస్తోంది. కూరగాయ వ్యర్థాలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయ్ సార్.
 
 బాబూరావునాయుడు : మంచినీళ్లు అందుతున్నాయా
 మేకల తిరుపతమ్మ : అందడంలేదు సార్. కనీసం వాడకం నీరు కూడా ఉండటం లేదు. 24 గంటలూ నీరు అందే ఏర్పాటు చేయండి సార్.
 
 బాబూరావునాయుడు : ఇంకా ఎవరైనా.. ఏమైనా చెబుతారా
 శ్రీధర్‌రాజు : సంచార రైతు బజార్ ఏర్పాటు చేస్తే చాలా మందికి అనుకూలంగా ఉంటుంది సార్. సత్రంపాడు, శాంతినగర్ ప్రాంతాల్లో కూడా ఒక రైతు బజార్ పెడితే ఆప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేసినట్లవుతుంది సార్.
 
 బాబూరావునాయుడు : షెడ్లు సౌకర్యంగానే ఉంటున్నాయా
 సుంకర మురళీకృష్ణ : లేదు సార్. అటువైపు షెడ్లు మరీ కిందకు ఉండటంతో వినియోగదారుల తలలకు తగులుతున్నాయి. చాలా అసౌకర్యానికి గురౌతున్నారు సార్.
 
 అక్కడి నుండి మరుగుదొడ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లిన జేసీ పరిస్థితుల్ని గమనించారు. నీళ్ల నిల్వ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుపై మూత లేకపోవడంతో చెట్టు ఆకులు అందులో పడి అపరిశుభ్రమౌతున్నాయని, ట్యాంకుపై మూత ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్ నందినీ దేవి జేసీకి విజ్ఞప్తి చేశారు. కూరగాయలు కొనుగోలు చేస్తున్న వి.రాఘవ అనే మహిళ వద్దకు వెళ్లిన జేసీ ‘కూరగాయల ధరలు ఎలా ఉన్నాయమ్మా’ అని అడిగారు.
 
 వి.రాఘవ : అరటి కాయలు, మునగ కాయలు కొనలేకపోతున్నాం సార్. క్యాబేజీకి ఒకే దుకాణం ఉండటంతో ధర అధికంగా ఉంటోంది. పక్కనే ఉన్న వ్యాపారి కల్పించుకుని ‘క్యాబేజీ ఒక్క రైతే తీసుకు వస్తున్నారు సార్. పైగా క్యాబేజీ వల్ల చెత్త అధికంగా ఉంటోందని ఎస్టేట్ ఆఫీసర్ ఒక్క దుకాణానికే అనుమతిచ్చారు. ధర మాత్రం బయటకన్నా తక్కువగానే ఉంటోంది’ అని చెప్పాడు. ఈవని భాస్కర్ అనే వినియోగదారుడు జేసీతో మాట్లాడుతూ ‘సార్ ఒకే రకం కూరగాయలకు బోర్డులో రెండు ధరలు రాస్తున్నారు. దీంతో వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నార’ని ఫిర్యాదు చేశారు.
 
 బాబూరావునాయుడు : రైతులూ.. సంతృప్తిగా ఉన్నారా
 కుమార్‌బాబు : కూరగాయలు తక్కువ ధరకే కావాలని అందరూ ఆశిస్తున్నారే తప్ప రైతుకు ఏమి మిగులుతోందనేది ఎవరూ పట్టించుకోవడం లేదు సార్. ఎరువులు, పురుగు మందులు వాడి పంటను పెంచి.. కాపు కాసిన తరువాత కోత కోయడానికి కూలీలను పెట్టుకోవడంతో నిర్వహణ భారం పెరిగిపోయి ఏమీ మిగలడం లేదు. రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని ధరలు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలి సార్.
 
 బాబూరావునాయుడు : రాత్రి ఎన్ని గంటల వరకూ వ్యాపారాలు చేస్తున్నారు
 
 ఎల్లపు దుర్గారావు : సుమారు 8 గంటల వరకూ వ్యాపారాలు చేస్తున్నాం. దోమలు చంపేస్తున్నాయ్. కరెంటు కూడా సరిగా ఉండటం లేదు సార్.
 
 బాబూరావునాయుడు : ఏమ్మా.. నీకు గుర్తింపు కార్డు ఇచ్చారా.
 
 గోరి రాజేశ్వరి : ఇచ్చారు సార్... ఇదిగో.
 
 బాబూరావునాయుడు : ఎంతకాలమైంది. అందరికీ ఇచ్చారా.
 
 రాజేశ్వరి : మూడు నాలుగు
 నెలలైంది సార్.
 జేసీ మరో వ్యాపారిని పిలిచి ‘ఇక్కడ అందరికీ ఆధార్ కార్డులున్నాయా, రైతు గుర్తింపు కార్డులున్నాయా’ అని ప్రశ్నించారు. రైతు బజార్ ఎస్టేటు ఆఫీసర్ నందినీదేవి కల్పించుకుని ‘రైతు బజార్లలో ఈ మధ్యనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు సార్. రైతులందరూ తమ పొలాల్లో ఫొటోలు తీయించుకుని దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో ఇక్కడ వ్యాపారులందరూ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశం పరిశీలనలో ఉంది. అందువల్ల గుర్తింపు కార్డులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది’ అని వివరించారు. అప్పుడే రైతు బజార్‌కు వచ్చిన ఒక పెద్దాయన జారుుంట్ కలెక్టర్‌ను కలసి ‘ఎస్టేట్ అధికారి రైతులపైన, వ్యాపారులపైన ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతున్నారు. ఆమెను తీరు మార్చుకోమని చెప్పండి’ అని సూచించడంతో జారుుంట్ కలెక్టర్ పక్కనే ఉన్న నందినీదేవిని చూపించి
 ‘ఈమేనా..’ అని అడిగారు. ఆ పెద్దాయన తనకు మనిషి తెలియదని, మైకులో ఆమె మాటలు వింటూ ఉంటానని.. ఇక్కడి వారు ఆమె గురించి అన్న మాటలు మీ దృష్టికి తీసుకువచ్చానని చెప్పారు.
 
 సంచార రైతు బజార్ల ఏర్పాటుకు కృషి
 ‘సాక్షి’ దినపత్రిక వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడింది. రైతు బజార్‌ను పరిశీలించడంతో వినియోగదారులు, వ్యాపారులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగింది. ముఖ్యంగా వినియోగదారులు సూచించిన మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సంచార రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్ కంటే రైతు బజార్‌లో బాగా తక్కువ ధరకు దొరికేలా రైతుల భాగస్వామ్యం పెంచడానికి ఇప్పటికే నిబంధనల్ని కఠినతరం చేశాం. ఈ రైతు బజార్‌లో మంచినీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య, పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉన్నట్టు గ్రహించాను. సమస్యల సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తాను. ధరల నిర్ణయంలో రైతుల కష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ప్రతిరోజూ చెత్త తొలగించేవిధంగా నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. ఏ దుకాణంలో ఏ రకం కూరగాయలు ఉంటే ఆ రకానికి చెందిన ధరలే బోర్డులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రజలు, వ్యాపారులు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ త్వరగా పరిష్కరించగలిగేవే కాబట్టి వాటిపై దృష్టి పెడతాం.
 - టి.బాబూరావునాయుడు, జాయింట్ కలెక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement