
దారి లేదు..బతికించే ‘దారీ’ లేదు..
ఎక్కే కొండ దిగే కొండ. కాలినడకన ఎడితేనే మందూ, మాకూ. దాహమేత్తే చెలమల నీరే గతి .. రోడ్లు ఏసినట్టే ఏసి..మద్యలోనే వదిలేసారు.
‘ఎక్కే కొండ దిగే కొండ. కాలినడకన ఎడితేనే మందూ, మాకూ. దాహమేత్తే చెలమల నీరే గతి .. రోడ్లు ఏసినట్టే ఏసి..మద్యలోనే వదిలేసారు. చంటిపిల్లలకు టీకాలు ఏయిద్దామన్నా పాతికకిలోమీటర్లు ఎల్లాలి. కరెంటు లేదు కిరోసిన్ దీపం బుడ్లే గతి’ ఇది రంపచోడవరం నియోజకవర్గంలోని రెండు గిరిజన గ్రామాల దుస్థితి. ‘జనమైత్రి’ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఏఎస్పీ సీహెచ్ విజయారావుతోనే జనం సమస్యలను ఎత్తి చూపించాలని భావించిన ‘సాక్షి’ అభ్యర్థనను మన్నించిన ఆయన శనివారం వీఐపీ రిపోర్టర్‌గా మారారు.ఆ రిపోర్టింగ్ వివరాలు..
దారి లేదు.. బతికించే ‘దారీ’ లేదు..
ఏఎస్పీ విజయారావు (గంగవరం మండలం కుసుమరాయి గ్రామంలో) : ఏం పెద్దాయనా నీ పేరేంటి? నీ వయస్సెంత?
గిరిజనుడు : అయ్యా నా పేరు సూర్యారావు సారూ, 70 ఏళ్లు బాబూ!
ఏఎస్పీ : మీ గ్రామంలో సమస్యలేమైనా ఉన్నాయా..
సూర్యారావు : మా ఇంటికి పక్కనే రోడ్డు వేశారు. సగంలో వదిలేశారయ్యా, మడుగులో నడుస్తున్నట్టుంది.
ఏఎస్పీ : నీ పేరేంటయ్యా? మీరెదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమైనా ఉందా?
గిరిజనుడు : సత్యనారాయణండీ. మా గ్రామానికి బస్సు వస్తే బాగుంటుంది సారూ.
ఏఎస్పీ : మీ సమస్యను ఆర్టీసీ డీఎం గారికి చెబుతా. బస్సువచ్చే ప్రయత్నం చేస్తాను.
ఏఎస్పీ : నీపేరేంటమ్మా?
గిరిజన మహిళ : బాపనమ్మ సర్
ఏఎస్పీ : ఏం చదువుకున్నావు?
బాపనమ్మ : ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ చేశాను. కొంత కాలం గంగవరం పీహెచ్‌సీలో పనిచేశాను. ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేదు. నా భర్త కూలిపనికి వెళుతున్నాడు.
ఏఎస్పీ : ఊళ్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయా?
బాపనమ్మ : గ్రామంలో ఊటనీరుతో ఇబ్బందిగా ఉంది. అస్తమాను జ్వరాలు వస్తున్నాయి సారూ.
ఏఎస్పీ : మరి వైద్యులు వస్తారు కదా, గ్రామంలో పరిశుభ్రత గురించి అందరూ శ్రద్ధ చూపాలి.
బాపనమ్మ : డాక్టర్‌లు రావడం లేదండీ. మందులు ఇచ్చే వారు రావడం లేదు.
ఏఎస్పీ : జ్వరాలొచ్చిన వారికి వైద్యసేవలు అందేలా చూస్తాను. అవసరమనుకుంటే పోలీస్ శాఖ తరఫున మీ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాను.
ఏఎస్పీ (ఓ అవ్వను ఉద్దేశించి) : అవ్వా.. ఎలా ఉన్నావు? నీ పేరేంటి?
అవ్వ : బాగున్నానయ్యా.. పొట్టమ్మ బాబూ..
ఏఎస్పీ : ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
పొట్టమ్మ : ఫించనీలు కొంత మందికి వస్తున్నాయి.. కొంత మందికి రావడం లేదు బాబా...
స్థానికుడు : మా సమస్య వినండి సారూ....నా పేరు సాల్మన్
ఏఎస్పీ : సాల్మన్ ఏంటి సమస్య?
సాల్మన్ : ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా గ్రామంలో ఎస్సీలకు ఇళ్లు ఇస్తే గూడు దొరుకుతుంది సారూ.
ఏఎస్పీ : తప్పని సరిగా మీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టిలో ఉంచుతాను.
ఏఎస్పీ : బాబూ.. నీపేరేంటి?
గిరిజన యువకుడు : రమేష్ సార్
ఏఎస్పీ : ఏమైనా సమస్యలు ఉన్నాయా?
రమేష్ : గ్రామానికి కంకర రోడ్డు ఉంది సారూ. తారు రోడ్డు వేస్తే బస్సులు రావడానికి ఇబ్బంది ఉండదు.
ఏఎస్పీ : గ్రామంలో సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి యువకులు కృషి చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకుని భవిష్యత్‌లో బాగా స్థిరపడాలి.
ఏఎస్పీ (రంపచోడవరం మండలం కింటుకూరులో) : చంటిపిల్లలతో ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లీ?
మహిళలు : సారూ మాది కింటుకూరు.
ఏఎస్పీ : మీ పేర్లేంటమ్మా?
ఓ మహిళ : మడి దుర్గ సారూ..
ఏఎస్పీ : ఎక్కడి నుంచి వస్తున్నారు?
దుర్గ : కొయ్యలగూడెం ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాం.
ఏఎస్పీ : చంటి పిల్లలకు ఏంటి ఇబ్బంది?
విజయ : పిల్లలకు టీకాలు వేయించేందుకు వెళ్లాం.
ఏఎస్పీ : మరి వేయించారా?
విజయ : ఆస్పత్రిలో ఎవరూ లేరు సారూ, మళ్లీ శనివారం వెళ్లాలి..
ఏఎస్పీ : నీ పేరేంటయ్యా?
గిరిజన యువకుడు : మడకం సంకురుదొర సారూ.
ఏఎస్పీ : మీ సమస్యలేమైనా ఉన్నాయా?
సంకురుదొర : రోడ్డు లేదు. ఇంటికాడికి పోవాలంటే అడ్డదారిలో పదిహేను కిలోమీటర్లు కొండలెక్కాలి సార్. జబ్బుచేస్తే ఆస్పత్రికి పోవాలంటే ఏమీ ఉండవయ్యా. సమయానికి తీసుకువెళ్లే దారిలేక మా వూరోళ్లు నలుగురైదుగురు చచ్చిపోయారు. మంచినీరు కూడా లేదయ్యా.
ఏఎస్పీ : మీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువె ళ్లి పరిష్కరిస్తాను.
ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు.
గురుగుల నారాయణరావు.