ఎన్‌ఐఏకు సహాయ నిరాకరణ | Visaka Police Not Cooperate On YS Jagan Murder Attempt Case | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏకు సహాయ నిరాకరణ

Published Sun, Jan 6 2019 5:36 AM | Last Updated on Sun, Jan 6 2019 4:13 PM

Visaka Police Not Cooperate On YS Jagan Murder Attempt Case - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును కుట్రపూరితంగా నిర్వీర్యం చేసిన విశాఖ పోలీసులు... ఇప్పుడు కేసు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్‌ 25న ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటనమీద దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ  నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్‌ఐఎ జనవరి 1న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది.

ఆ క్రమంలో ఎన్‌ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి(సీఐఓ) మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌తోసహా ఐదుగురు అధికారులు శనివారం విశాఖకు చేరుకుని రంగంలోకి దిగారు. ఎన్‌ఐఎ అధికారులు ఇలా అడుగుపెట్టగానే విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్హా అర్ధంతరంగా సెలవులోకి వెళ్లడం గమనార్హం. వ్యక్తిగత పనుల పేరిట ఆయన శనివారం నుంచి నాలుగురోజులపాటు లీవులోకి వెళ్లడంతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవిశంకర్‌ అయ్యన్నార్‌కు తాత్కాలిక సీపీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగగానే లడ్హా ఉద్దేశపూర్వకంగా సెలవు పేరిట సహాయ నిరాకరణ చేస్తున్నారన్న వాదనలు స్వయంగా పోలీసువర్గాల నుంచే వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సూచనల మేరకే లడ్హా సెలవుపై వెళ్లారని ఆ వర్గాలంటున్నాయి.

మొదటినుంచీ లడ్హా తీరు వివాదాస్పదమే
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగినప్పటి నుంచి విశాఖ సీపీ లడ్హా తీరు వివాదాస్పదంగానే ఉంది. ఘటన జరిగిన రోజైన గతేడాది అక్టోబర్‌ 25న ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు. అమరావతిలో ఉన్నతాధికారులతో సమావేశానికి వెళ్లినందువల్ల ఆరోజు కాస్త ఇబ్బందైందని చెప్పుకున్న లడ్హా ఆ తర్వాత విచారణ తంతును దగ్గరుండి నడిపించారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఏసీపీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను నియమించినప్పటికీ మొత్తం కథ లడ్హానే నడిపారు.

జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు ఒక్కడికే విచారణను పరిమితం చేసి... అతడి పోలీస్‌ కస్టడీ ముగియగానే సిట్‌ విచారణనూ బంద్‌ చేసేశారు. చివరికి సిట్‌ కార్యాలయానికి తాళం కూడా వేసేశారు. అయితే కేసు జనవరి 1న ఎన్‌ఐఎకి బదిలీ అయిన విషయం తెలుసుకుని హడావుడిగా సీపీ లడ్హా జనవరి 2న ప్రెస్‌మీట్‌ పెట్టి జగన్‌పై జరిగింది హత్యాయత్నమే కాదని, ప్రచారం కోసం శ్రీనివాసరావు గాయం చేశాడని ప్రకటించారు. ఈ ప్రకటనతో లడ్హా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఇప్పుడు ఎన్‌ఐఎ రంగంలోకి దిగగానే నాలుగురోజులపాటు సెలవు పేరిట సెల్‌ స్విచాఫ్‌ చేసి ఎవరికీ అందుబాటులోకి రాకుండా వెళ్లిపోవడం వివాదాస్పదమవుతోంది.

మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ..
ఇదిలా ఉండగా, రంగంలోకి దిగిన ఎన్‌ఐఎ అధికారులు శనివారం ముందుగా ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసులు విచారణ చేపట్టిన క్రమాన్ని అడిగి తెలుసుకునేందుకు యత్నించారు. తర్వాత సిట్‌ అధికారులతోనూ సమావేశమయ్యారు. అయితే సదరు అధికారులెవ్వరూ ఎన్‌ఐఎ అధికారులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. కనీసం సమాచారం కూడా అందించలేదంటున్నారు. అంతా పోలీస్‌ కమిషనర్‌ లడ్హా దగ్గరుండి చూశారు.. ఏదైనా ఉంటే మీరు ఆయనతో మాట్లాడండని ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ పోలీసులు, సిట్‌ వర్గాలు ఎన్‌ఐఎ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. ‘‘దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.. మీ దర్యాప్తు మీరు చేసుకోండి... మీకు సహకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా లేదు.. అలాగని రాష్ట్రప్రభుత్వం కూడా ఇప్పటివరకు మాకేమీ ఆదేశాలివ్వలేదు.. ప్రభుత్వాన్ని కాదని సమాచారమిచ్చినా.. సహకరించినా మాకు ఇబ్బంది.. మమ్మల్ని అర్థం చేసుకోండి’’ అంటూ పోలీసులు ఓ దశలో ఎన్‌ఐఎ అధికారుల్ని వేడుకున్నట్టు తెలుస్తోంది.
అలా ఏమీ లేదు..

వాళ్ళడిగిన సమాచారం ఇస్తున్నాం
‘‘ఎన్‌ఐఎ అధికారులకు మేం సహకరించట్లేదనే వాదనల్లో నిజం లేదు. ఎన్‌ఐఎ సీఐఓ మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌ నన్ను కలిశారు. కావాల్సిన సమాచారం అడిగారు. నా పరిధిలో నేను చెప్పాల్సింది చెప్పాను..’’ అని కేసు విచారణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్‌ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధితో అన్నారు. కాగా ఇప్పటివరకు ఎన్‌ఐఎ బృందం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన దాఖలాల్లేవని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి చెప్పారు.     
– సిట్‌ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు

దర్యాప్తు మొదలుపెట్టాం.. అప్పుడే ఏమీ చెప్పలేం
‘‘దర్యాప్తు ఇవాళే మొదలుపెట్టాం... విచారణ ప్రాథమిక దశలో ఉంది.. అప్పుడే ఏమీ చెప్పలేం...’’ అని ఎన్‌ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి(సీఐఓ) మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌ శనివారం రాత్రి సాక్షి ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారా? అనే ప్రశ్నకు.. నో కామెంట్‌ అని ఆయన సమాధానమిచ్చారు.
– ఎన్‌ఐఎ సీఐఓ మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement