సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సాగర్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. సాగర్ నగర్ హెచ్‌ఐజీలో ఆర్టీసీ రీటైర్డ్ జేఈ చల్ల ఉమా మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉమ మహేశ్వరరావు, కొడుకు, కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్ర పోయారు. అర్ధరాత్రి వాళ్లింట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు స్థానికులు గుర్తించారు. ఆ ఘటనలో కుమారుడు సతీష్ చంద్ర (38), కూతురు లావణ్య (32) మృత్యువాత పడ్డారు. ఉమా మహేశ్వరరావు ప్రాణాపాయ స్థితిలో వున్నారు.
అయితే వీరిది ఆత్మహత్యే అంటున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఉమా మహేశ్వరరావు భార్య మరణించింది. అప్పటి నుంచి ఆయన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. మానసిక సమస్యల నేపథ్యంలోనే గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment