విశాఖపట్నం జిల్లా సాలిగ్రామపురంలోని ఇంట్లో బుధవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో ఇంట్లో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిపమాక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సుల్తానా (40), సోఫియా (17), షఫీ (8)లుగా గుర్తించినట్లు చెప్పారు.
ఇంటి యజమాని మొయినుద్దీన్ విశాఖపట్నం పోర్టులో కళాసిగా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు వివరించారు. అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని... ఆ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ పేలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ ప్రమాదానికి షార్ట్ సర్క్యూల్ కారణం కాదని విద్యుత్ సిబ్బంది వెల్లడించారు. అయితే ప్రమాద ఘటన పలు అనుమానాలకు తావిచ్చేదిగా ఉందని నగర ఏసీపీ మహేష్ విలేకర్లుకు వెల్లడించారు. దాంతో ఇంటి యజమాని మొయినుద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని అతడు పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిలిండర్ పేలుడుపై పలు అనుమానాలు: ఏసీపీ
Published Wed, Jun 25 2014 12:12 PM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
Advertisement