ఎవరా టీడీపీ ఎమ్యెల్యే?
♦ కిడ్నాప్ వ్యవహారంలో విశాఖ టీడీపీ ఎమ్మెల్యే హస్తం
♦ సీఐని ఏసీబీకి పట్టించిన బాధితుడి ఆరోపణ
♦ ఈ వ్యవహారంలో వెలుగు చూస్తున్న కొత్త విషయాలు
♦ ఆ సంగతేంటో తేల్చితేనే బడాబాబుల గుట్టురట్టు
రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్... సీఐపై ఏసీబీ దాడులు... వీటి వెనుక చాలా కథ నడిచింది. జరిగిన వరుస సంఘటనల్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు సీఐని ఏసీబీకి పట్టించిన బాధితుడు విప్పిన గుట్టుతో కిడ్నాప్ వ్యవహారంలో విశాఖకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కీలకపాత్ర పోషించినట్టు తేలింది. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది పోలీసులు చిత్తశుద్ధితో... నిష్పక్షపాతంగా... లోతుగా విచారిస్తేనే బయటకు వస్తుంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘హోంగార్డులతో కిడ్నాప్ చేయించిన ఎర్ని శ్రీనివాసరావు నన్ను భయపెడుతున్నాడు. నా భార్యబిడ్డలను చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఇందులో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉంది. భూ తగాదాల్లో నానా ఇబ్బందులు పెడుతున్నారు. నా ఆస్తులన్నీ బలవంతంగా రాయించుకున్నారు. వాటిని రికవరీ చేయమంటే సీఐ శోభన్‌బాబు లంచం డిమాండ్ చేశారు. అంత సొమ్ము ఇచ్చుకోలేక ఏసీబీని ఆశ్రయించాను.’ వన్‌టౌన్ సీఐ శోభన్‌బాబును ఏసీబీకి పట్టించిన రియల్టర్, బాధితుడైన ఎర్రా ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలివి.
ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే లంచం కేసును పక్కన పెడితే కిడ్నాప్ వ్యవహారంలోనే బడాబాబులున్నారనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, దందాలు, కిడ్నాప్‌లకు విశాఖ ఆలవాలంగా మారింది. అధికార పార్టీ అండదండలు చూసుకుని కొందరు చెలరేగిపోతున్నారు. నేతల డైరెక్షన్‌లో కిడ్నాప్‌లకు, హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అక్కడ పలు సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సహకారంతోనే తనను కిడ్నాప్ చేశారని ఎర్రా ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కొత్త విషయాలు వెలుగులోకి...
రియల్టర్ ఎర్రా ఈశ్వరరావును విజయనగరం రూరల్ పోలీసుస్టేషన్‌కు చెందిన ఇద్దరు హోంగార్డులు కిడ్నాప్ చేశారు. వీరిని మరో రియల్టర్ ఎర్ని శ్రీనివాసరావు పురమాయించారు. ఇదంతా పోలీసుల విచారణలో బయటపడింది. ఇప్పుడా ఇద్దరు హోంగార్డులు ఊచలు లెక్క పెడుతున్నారు. కిడ్నాప్‌కు సూత్రధారైన శ్రీనివాసరావు, కారు డ్రైవర్, మరో ఇద్దరు సహాయకుల్ని ఇంకా పట్టుకోవల్సి ఉంది.
రికార్డు ప్రకారం వారి కోసం వెదుకుతున్నారు. కానీ, కిడ్నాప్‌కు పురమాయించిన శ్రీనివాసరావు వన్‌టౌన్ సీఐతో టచ్‌లో ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే శ్రీనివాసరావు బలవంతంగా రాయించుకున్న ఆస్తుల్ని రికవరీ చేయాలని బాధితుడు ఎర్రా ఈశ్వరరావు వన్‌టౌన్ సీఐ శోభన్‌బాబును ఆశ్రయించాడన్నది ఆయన స్టేట్‌మెంట్‌తో స్పష్టమైంది. మరి దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతారా... లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.