మంగళవారం రేవంత్ రెడ్డిని వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు
♦ ముగిసిన ఏసీబీ కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు
♦ మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ న్యాయమూర్తికి రేవంత్ ఫిర్యాదు
♦ కోర్టు ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న ఏసీబీ
♦ నేడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలం నమోదు!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యేకు ముడుపులు ఇవ్వబోతూ ఏసీబీకి పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా ఇతర నిందితుల ఏసీబీ కస్టడీ ముగిసింది.
దీంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు వారికి 15వ తేదీ వరకు రిమాండ్ విధించగా.. పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను ఏసీబీ అధికారులు మంగళవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.లక్ష్మీపతి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారా, సౌకర్యాలు కల్పించారా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి నిందితులను అడిగారు. దీంతో కస్టడీలో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, మొదటి రోజు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
పలుమార్లు అడిగిన తర్వాత కలుషితమైన నీటిని ఇచ్చారని, దీంతో తనకు గొంతు ఇన్‌ఫెక్షన్ వచ్చిందని న్యాయమూర్తికి చెప్పారు. బాత్‌రూంకు వెళ్లనివ్వలేదని ఆరోపించారు. రాత్రిళ్లు సిట్ కార్యాలయ ఆవరణలో సెక్యూరిటీ గార్డులు రక్షణగా వేసుకున్న ఇసుకబస్తాలున్న చోట బల్లలపై పడుకోమన్నారని.. దీంతో తాను నిద్రపోలేకపోయానని పేర్కొన్నారు. అల్పాహారం, టీ కూడా ఇవ్వలేదని, ఏసీబీ జేడీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఇచ్చారని అన్నారు. సిట్ కార్యాలయంలోని సిబ్బంది సైతం తమతో దురుసుగా ప్రవర్తించారని, పోలీసులు కాని వారు కూడా తమ దగ్గరికి వచ్చి ప్రశ్నించేవారని చెప్పారు.
ఇక తనకు థైరాయిడ్ సమస్య ఉందని, బల్లపై పడుకోబెట్టడంతో వెన్నునొప్పి వచ్చిందని సెబాస్టియన్ పేర్కొన్నారు. తనకు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని, వైద్య పరీక్షలు చేయించాలని కోరినా పట్టించుకోలేదని, అధికారులను గట్టిగా ప్రశ్నించడంతో వైద్య పరీక్షలు చేయించారని ఉదయసింహ చెప్పారు. ఈ ఫిర్యాదులను నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. ఏసీబీ వివరణ కోరారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించామని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులను న్యాయవాదుల సమక్షంలోనే విచారించామని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
వాంగ్మూలం నమోదుకు పిటిషన్..
ఓటు కోసం డబ్బుతో ప్రలోభపెట్టే యత్నం చేస్తున్నారంటూ రేవంత్‌పై ఫిర్యాదు చేసిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట నమోదు చేయాలని నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏసీబీ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు బుధవారం వాంగ్మూలం నమోదు చేసే అవకాశముంది.
రేవంత్‌రెడ్డికి వైద్యపరీక్షలు
‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ కస్టడీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్‌లకు అధికారులు మంగళవారం రెండుసార్లు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తొలుత ఈ ముగ్గురిని ఉదయం 8:30కు ఉస్మానియాకు తీసుకువచ్చి రక్తపోటు, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు చేయించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. విచారణ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరోసారి వైద్య పరీక్షలు చేయించారు. రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వారిని పరీక్షించిన వైద్యులు తెలిపారు.