'సోమవారంలోగా విచారణకు రండి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు పురోగతి దిశగా సాగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సెక్షన్ 41 ఏ సీఆర్పీసీ ప్రకారం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోగా విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. శనివారం ఏసీబీ అధికారులు హైదర్ గూడలోని సండ్ర వెంకట వీరయ్య ఇంటికి నోటీసులు అతికించి వచ్చారు. ఆ సమయంలో సండ్ర ఇంట్లో ఎవరూ లేరు. కాగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు సండ్ర ఏసీబీ కార్యాలయానికి రావచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. టీడీపీకి చెందిన కీలక నేతలను ఏసీబీ విచారించవచ్చని భావిస్తున్నారు.
ఏసీబీ సండ్ర వెంకట వీరయ్యకు ఇంతకుముందే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తనకు 10 రోజులు గడువు కావాలని సండ్ర ఏసీబీ అధికారులను కోరారు. గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరయిన తర్వాత సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను రాజమండ్రిలో చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నానని, ఏ సమయంలోనైనా ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని సండ్ర తన లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సండ్రకు నోటీసులు జారీ చేశారు. సండ్రతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించే అవకాశముంది. ఏసీబీ అధికారులు సండ్రను అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేంనరేందర్ రెడ్డికి ఓటు వేయడం కోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి 50 లక్షలు ముడుపులు ఇస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.