సండ్రకు మరోసారి నోటీసులు?
విచారణకు హాజరు కాకపోవడంతో ఏసీబీ సీరియస్
స్పందించకపోతే నిందితుల జాబితాలో చేర్చాలని నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నోటీసులు జారీ చేసినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈసారీ స్పందించకపోతే ఆయన్ని నిందితుల జాబితాలోకి చేర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రూ.50 లక్షలు ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.
ఈ కుట్రలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకూ భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అందుకోసం ఆయన్నీ విచారించాలని భావించి.. జూన్ 16న సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సండ్ర ఇంటి (208 క్వార్టర్) తలుపునకు నోటీసు అంటించారు. దీనికి సండ్ర తనకు వంట్లో బాగాలేదని, ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని లేదా ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ జూన్19న ఏసీబీకి లేఖ రాశారు. పదిరోజులైనా ఏసీబీ ఎదుటకు రాలేదు. ఎక్క డ చికిత్స పొందుతున్నారో ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఈ క్రమంలో సండ్రను ఏపీ ప్రభుత్వమే దాచిపెట్టిందని అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది. కాగా ఈసారి ఖమ్మం జిల్లాలోని సండ్ర నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నోటీసులకు కూడా సండ్ర స్పందించకపోతే.. ఆయన్ని నిందితుల జాబితాలో చేర్చి అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.