ఓటుకు లంచమిస్తే చట్టం వర్తించదు
చంద్రబాబు తరఫు న్యాయవాది వాదన
► ‘ఓటుకు కోట్లు’లో బాబు పిటిషన్‌పై వాదనలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) ఎలా వర్తిస్తుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రశ్నించారు. ఆయన ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం వాదనలు ప్రారంభమయ్యాయి.
పీసీ చట్టం వర్తించదు..
లూథ్రా తన వాదనలు కొనసాగిస్తూ.. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజావిధుల్లో భాగం కాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలోనే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు లంచం ఇవ్వచూపారన్నది ప్రధాన ఆరోపణని తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితులపై ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారన్నారు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుందో అర్థం కాకుండా ఉందన్నారు. ఇందుకు లూథ్రా ఓ ఉదాహరణనిచ్చారు.‘మునిసిపాలిటీలో ఓ ఇంజనీర్‌ను తీసుకుందాం. తాను చేయాల్సిన పనికి సంబంధించి లంచం తీసుకుంటే అది నేరం అవుతుంది.
దానికి అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చు. అదే ఇంజనీర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే దానికి అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుంది? పబ్లిక్ సర్వెంట్ హోదాలో అతను ఓటు వేయలేదు. పెపైచ్చు ఓటు హక్కు ప్రజా విధుల్లో భాగం కానే కాదు.’ అని లూథ్రా వివరించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఏసీబీ సంబంధిత కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది’’ అని ఆయన తెలిపారు. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని సంబంధిత కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు జరపాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాల వల్ల ఏసీబీ అధికారులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని, ఒకే కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని ఆయన కోర్టుకు నివేదించారు.
సాక్షుల వాంగ్మూలాలు ఎలా వచ్చాయి?
ఏసీబీ చార్జిషీట్‌లో ఉన్న సాక్షుల వాం గ్మూలాలు కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలా వచ్చాయని లూథ్రా ప్రశ్నించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలాలను థర్డ్ పార్టీకి ఇవ్వడం సాధ్యం కాదని, ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు వ్యాజ్యం నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ హైకోర్టు గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం వాదనలు మొదలయ్యాయి.