ఏసీబీ దర్యాప్తుతో మేం సంతృప్తిగా ఉన్నాం
ఓటుకు కోట్లు కేసులో సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేస్తున్న దర్యాప్తు పట్ల సంతృప్తికరంగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా తెలిపారు. చంద్రబాబు ను ఇబ్బంది పెట్టడానికే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారని తెలిపారు. దురుద్దేశాలు, వేధింపులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు కాబట్టే, తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
రెండో రోజూ లూత్రావాదనలు
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు సక్రమంగా సాగడం లేదన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై 4 వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ముందు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా గురువారం చంద్రబాబు తరఫున వాదనలు మొదలు పెట్టారు. తదుపరి వాదనలు వినిపించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కోరారు. విచారణను 7కు వాయిదా వేశారు.
ఉండవల్లి హక్కును కాలరాయలేను...
ఈ కేసులో తన వాదనలూ వినాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేయాలని లూత్రా వాదించారు. దీనికి న్యాయమూర్తి సునీల్ చౌదరి స్పందిస్తూ... ‘వాదనలు వినిపించే ఆయన హక్కులను కాలరాయలేను’ అని తేల్చి చెప్పారు.