సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.
అయితే ఉదయమే తీర్పు వెలువరించాలన్న చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ సమయంలో తమకు విచారించాల్సిన కేసులు చాలానే ఉన్నాయని కోర్టు పేర్కొంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది. కౌంటర్లు దాఖలైన తరువాత కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.
బీపీ, షుగర్ ఉంది.. : అంతకు ముందు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకున్న ప్రాణహాని రీత్యా ఆయనకు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించిందన్నారు. ఆయన ప్రాణాలకు పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయన్నారు. జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అంతేకాక చంద్రబాబు వయస్సు 73 ఏళ్లని, షుగర్, బీపీలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే ఆయనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్‌లో ఉంచాలని అభ్యర్థించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు అధికారులు ఎన్నడూ చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహించలేదని, ఎలాంటి డాక్యుమెంట్లను జప్తు చేయలేదని తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ స్కామ్‌లో ఎలాంటి ఆధారాలు ఉండే అవకాశం లేదన్నారు. హౌస్ రిమాండ్‌లో ఉంచితే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం జరగదన్నారు. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించారు.
జైలులోనే భద్రత ఎక్కువ...
అనంతరం సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హౌస్ రిమాండ్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలోలో ఉన్న నేపథ్యంలో హౌస్ రిమాండ్ పిటిషన్ నిరర్థకమైందన్నారు. చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అభ్యర్థన అసాధారణమన్నారు. వాస్తవానికి హౌస్ రిమాండ్ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదన్నారు. అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు.
జైలులో ఆయన భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేందుకు ఎలాంటి వైద్య రికార్డులను కోర్టు ముందు ఉంచలేదన్నారు. అరెస్ట్, రిమాండ్ సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్లు తేల్చారన్నారు. జీవన శైలి సంబంధ వ్యాధులకు సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు అరోగ్యంగా ఉన్నారు కాబట్టే అరెస్ట్‌కు ముందు ఆయన చాలా క్రియాశీలకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
హౌస్ రిమాండ్‌కు పంపితే సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం ఉందని చంద్రబాబు చెబుతున్నారని, అయితే వాస్తవానికి ఆయన ప్రోద్భలంతోనే ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారయ్యారని తెలిపారు. వారు దర్యాప్తునకు దొరకుండా ఉండేందుకే అలా చేశారన్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండేందుకే జ్యుడీషియల్ కస్టడీ విధిస్తారని, ఇప్పుడు చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఇస్తే ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే ఈ కోర్టు చంద్రబాబుకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, తగిన భద్రత కూడా కల్పించాలని జైలు అధికారులను ఆదేశించిందని తెలిపారు. చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయకుండా హౌస్ రిమాండ్ కోసం పట్టుబడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ఉదహరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఈ సమయంలో చంద్రబాబు న్యాయవాది లూథ్రా జోక్యం చేసుకుని ఉదయమే తీర్పు వెలువరించాలని పట్టుబడ్డారు. అయితే ఉదయం అనేక కేసులో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా విచారించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment