ఎవరి పాత్ర ఏమిటో తేలుస్తాం
- ఓటుకు కోట్లు కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ
- విచారణ 27కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వస్తారని, అందువల్ల కేసు విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. చంద్రబాబు తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వస్తారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోర్టును కోరారు.
ఈ సమయంలో రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. తరువాత ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అందరూ ఇలా ఎవరికి నచ్చిన తేదీలు వారు అడిగితే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అయితే కేసును ఈ నెల 27కు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు. మిగిలిన న్యాయవాదులు సైతం దీనికి అభ్యంతరం చెప్పకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను 27కు వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో కోర్టు గత నెల 2న ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.
దర్యాప్తు కొనసాగుతోంది...
ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఏసీబీ అదనపు ఎస్‌పీ ఎం.మల్లారెడ్డి హైకోర్టుకు నివేదించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఈ నేరంలో ఎవరి పాత్ర ఏమిటో తేలుస్తామని ఆయన తన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఏసీబీ ప్రాథమికంగా నలుగురిపై కేసు నమోదు చేసి ఆ మేర ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ కూడా దాఖలు చేసిందన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై దర్యాప్తు కొనసాగుతోందని, వెలుగుచూసే ఇతర వివరాలన్నింటినీ అనుబంధ చార్జిషీట్‌ల ద్వారా కోర్టు ముందుంచుతామని, ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టుకు తెలియచేశామని వివరించారు. నిందితుల్లో ఒకరైన మత్తయ్యపై హైకోర్టు కేసును కొట్టేసిందని, దీనిపై తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది అక్కడ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదును దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు ఏసీబీకి పంపిందని, అయితే వాస్తవానికి ఒకే కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌ల నమోదు ఉండద ని అన్నారు. ఇదే విషయాన్ని తాము మెమో ద్వా రా ప్రత్యేకకోర్టుకు తెలిపామన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులో మళ్లీ ఫిర్యాదు దాఖలు చేసే అర్హత రామకృష్ణారెడ్డికి లేదని తెలిపారు. రామకృష్ణారెడ్డి సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద దర్యాప్తు కోరలేదని, సెక్షన్ 210 కింద కోరారని తెలిపారు.