సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలో సాగిస్తున్న విచ్చలవిడి అవినీతిని, ప్రజాధనం లూటీని అడ్డుకుంటున్నందుకే నాపై కుట్ర పన్ని కక్ష సాధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కె) ఆరోపించారు. చంద్రబాబు, తన పోలీసులు, ఏబీఎన్ రాధాకృష్ణతో సాగిస్తున్న దుష్ప్రచారానికి, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సాక్షిగా విచారణకు హాజరైన అనంతరం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏసీబీ కేసులో ఆర్‌కె అంటూ టీడీపీ అనుకూల, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని చెప్పారు. గతంలో తనను పిలిచినప్పుడు కంటికి ఆపరేషన్ చేయడంతో.. ఇప్పుడు హాజరయ్యానని తెలిపారు. విచారణలో దుర్గాప్రసాద్ నీకు తెలుసా? ఆయన వద్ద నుంచి భూములు కొన్నావా? అని మాత్రమే అడిగారని చెప్పారు. గుంటూరులో దుర్గాప్రసాద్ అనే స్నేహితుడు నుంచి తాను చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దుర్గాప్రసాద్‌పై ఏడాదిన్నర క్రితం దాడులు జరిగితే తనను ఇప్పుడు పిలవడం కక్ష సాధింపులో భాగం కాదా అని ప్రశ్నించారు. పోలీసులు ప్రకటించే అధికారికపత్రంలో ఎక్కడా తన ప్రస్తావన లేదని, ఏదో విధంగా ఇరికించాలనే కుట్రతో.. తనకు దుర్గాప్రసాద్ స్నేహితుడు కాబట్టి తాను గతంలో ఆస్తులు కొన్న సమాచారం తెలుసుకుని, చంద్రబాబు ప్రోద్భలంతో సీఆర్‌పీసీ 160 ప్రకారం సాక్షిగా మాత్రమే పిలిచారన్నారు.
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..: నా పేరుపై కొంటే నా భార్య పేరు మీద అని రాస్తున్నారని, సోషల్ మీడియా, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్‌కె చెప్పారు. ఏబీఎన్ రాధాకృష్ణ తాను ప్రచారం చేసింది తప్పేనని ఒప్పుకుంటే చాలని హితవు పలికారు. ఒకవేళ వారు రాసింది నిజం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని..అందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.
బాబు పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం: చంద్రబాబు గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను విచ్చలవిడిగా దోచుకుంటున్న విషయాన్ని తాను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని ఆర్‌కె తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దర్యాప్తు ఆపించుకున్న నేపథ్యంలో తాను సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఐదుసార్లు లిస్ట్ అయి విచారణకు స్వీకరించారని తెలిపారు. ఆ రోజు నుంచి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని, న్యాయాన్ని కాపాడేందుకు నేను చేస్తున్న ప్రయత్నం వారికి నచ్చడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కటకటాల్లోకి పంపేవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది కేసుల మాఫీ కోసమేనని విమర్శించారు.
సదావర్తి భూముల దోపిడీని అడ్డుకున్నా: అమరావతి దేవస్థానం కోసం వాసిరెడ్డి వంశస్థులు దానంగా ఇచ్చిన సదావర్తి భూములపై మంత్రి లోకేష్ కన్ను పడిందని ఆర్‌కె తెలిపారు. తన బినామీలతో కాజేయాలని చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వందల కోట్ల రూపాయలను కాపాడానని చెప్పారు. రాజధానిలో అన్యాయంగా రైతుల భూములను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటుంటే.. తాను అడ్డుపడ్డానని, పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయ్యాక చాలా ఆస్తులు అమ్ముకుని మంగళగిరిలో అద్దె ఇంట్లో ఉంటున్నాని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు, ఆయన కుమారుడి ఆస్తులపై విచారణకు సిద్ధమేనా అని ఆర్‌కె సవాల్ విసిరారు.
పరువు నష్టం దావా వేసినందుకే: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు రాసి దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేసినందుకే తనపై రాధాకృష్ణ విషం కక్కుతున్నాడని ఆర్‌కె విమర్శించారు.
దుర్గాప్రసాద్ ఆస్తులు తేలకముందే...
పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై 2017 జనవరిలో అక్రమాస్తులు కలిగి ఉన్నాడని దాడులు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ చార్జిషీట్ వెయ్యలేదు. ఓవైపు దుర్గాప్రసాద్ ఆస్తుల వివరాలు తేలకముందే అతని వద్ద 2006లో ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే భూములు కొనుగోలు చేశారని, ఆయన్ను పిలిచి విచారించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాప్రసాద్ వద్ద 2006లోనే ఆర్‌కె భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2017లో దుర్గాప్రసాద్‌పై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో దాడులు చేసినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి భూములు అమ్మిన పత్రాలూ లభించలేదు. అయినా సరే ఓ దినపత్రికకు లీకులిచ్చి రామకృష్ణారెడ్డిని సీఆర్‌పీసీ 160 కింద పోలీసులు పిలిపించి విచారించడం దారుణమని పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓవైపు పోలీసు అధికారి ఆస్తులే నిరూపణ కాకపోతే, అధికారికంగా డబ్బు చెల్లించి భూమి కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎమ్మెల్యేను విచారణకు పిలిపించడం కేవలం కుట్రలో భాగమేనని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment