సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ టికెట్‌తో గెలుపొంది అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపుదారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత వారం దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు న్యాయ, శాసన వ్యవహారాలశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శిలకు కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అమ్ముడుపోయామని స్వయంగా చెబుతున్నారు...
అధికార పార్టీ నేతలు తమకు డబ్బులు, పదవుల ఆశ చూపినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొందరు బహిరంగంగానే చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ‘నిస్సంకోచంగా అడ్డుకట్టవేయాల్సిందే. అయితే మీ పార్టీ గతంలో ఎప్పుడూ ఫిరాయింపులకు పాల్పడలేదా?’ అని ప్రశ్నించింది. వైఎస్సార్ సీపీ 2014 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను గెలిచిందని, ఇప్పటి వరకు ఫిరాయింపులకు పాల్పడటంగానీ ప్రోత్సహించడం గానీ చేయలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తమ పార్టీలోకి టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి వచ్చారని, ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేసిన తరువాతే పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు.
తమ పార్టీ విలువలు ఉన్న పార్టీ అని తెలిపారు. స్పీకర్ తన విధులను నిర్వర్తించకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్యని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఎప్పటికప్పుడు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నా ఇప్పటివరకూ స్పందించ లేదన్నారు. స్పీకర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు తప్పనిసరిగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని, అయితే సభాపతి వైపు నుంచి వాదనలు వినకుండా నేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు ఇస్తామని, అందరి వాదనలు విన్నాక తగిన ఉత్తర్వులు ఇస్తామంది. పార్టీ ఫిరాయించిన ఎంపీల పేర్లను ఈ పిటిషన్ నుంచి తొలగించి అనుబంధ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించగా పిటిషనర్ తరపు న్యాయవాది అందుకు అంగీకరించారు.
‘గతంలో చంద్రబాబు తరఫున హాజరైనందున ఈ కేసును విచారించలేను’..
సీఎం చంద్రబాబే స్వయంగా వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ను ప్రలోభ పెట్టి టీడీపీలోకి ఫిరాయించేలా చేస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. పశ్చిమ గోదావరి జిల్లా విద్యానగర్‌కు చెందిన వీర్ల సతీష్ కుమార్ దీన్ని దాఖలు చేయటం తెలిసిందే.
అయితే ఈ వ్యాజ్యంలో చంద్రబాబు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉండటాన్ని గమనించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దీన్ని విచారించేందుకు నిరాకరించారు. గతంలో తాను చంద్రబాబు తరపున వాదనలు వినిపించానని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించడం నైతికంగా భావ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా చంద్రబాబు ప్రతివాదిగా ఉన్నారా? అని ఈ సందర్భంగా ఏసీజే ఆరా తీశారు. ఆ వ్యాజ్యంలో చంద్రబాబు ప్రతివాది కారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఒకవేళ కావాలంటే ఆ వ్యాజ్యాన్ని కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని ఏసీజే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment