'రెండు రోజుల్లో దుబాయ్ టు వైజాగ్'
విశాఖపట్నం: దుబాయ్ నుంచి వైజాగ్‌కు త్వరలో నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విశాఖ-పారాదీప్ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రెండు రోజుల్లోనే ఈ సముద్ర మార్గం ద్వారా దుబాయ్ చేరుకోవచ్చన్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో విశాఖ సమీపంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పోర్టులన్నీ అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. పోర్టుల అభివృద్ధి ద్వారానే రవాణా పెరిగి ఆదాయం ఆర్జించే అవకాశాలుంటాయని చెప్పారు. దుబాయ్ నుంచి నౌకలు విశాఖ, పారాదీప్, గంగవరం, కాకినాడ వంటి పోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
కాగా, పారాదీప్ పోర్టుకు నడుపుతున్నట్టుగానే మార్మ గోవా పోర్టుకు కూడా ప్రత్యేక రైళ్లను నడిపితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన ఓడరేవుల మధ్య విశాఖ-పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపడం అభినందనీయమన్నారు. మార్మగోవా పోర్టుకు కూడా ప్రత్యేక రైళ్లను విశాఖ నుంచి నడిపితే తూర్పు, పశ్చిమ భారత్‌లలో వాణిజ్య రవాణా అభివృద్ధి అవుతుందన్నారు. రానున్న రోజుల్లో లాజిస్టిక్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అందుకు అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉండడం మరింత మంచి అవకాశమన్నారు.
పారాదీప్ వెళ్లే రైలులో చేపల వేటకు వెళ్లే వారంతా అక్కడికి వెళ్లి అక్కడి నుంచి వేటకు వెళ్లేందుకు బాగుంటుందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన విశాఖ-చెన్నై, విశాఖ-గుణుపూర్, విశాఖ-సికింద్రాబాద్ రైళ్లను విశాఖ నుంచి ప్రారంభించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, డీఆర్‌ఎం అనిల్‌కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు.