
ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ భూమిపూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానితోపాటు పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసమే తాను తరచూ విశాఖ వస్తున్నానని చెప్పారు. మంగళవారం ఆయన విశాఖలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రూ.50 లక్షలతో నిర్మించిన వీవీఐపీ లాంజ్‌ను ప్రారంభించారు. దీంట్లో సీఎం చాంబర్, యాంటీరూం, ప్యాంట్రీ, తదితర రూములుంటాయని, ప్రముఖులు విమానాశ్రయంలో కొద్దిసేపు విరామం తీసుకునేందుకు, అత్యవసర సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని తెలిపారు.
అనంతరం ఎన్‌ఏడీ జంక్షన్లో రూ.113.60 కోట్లతో నిర్మించనున్న రెండంతస్తుల ఫ్లైఓవర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మించడం ఇదే తొలిసారన్నారు. 24 నెలల్లో దీనిని నిర్మించాల్సి ఉన్నప్పటికీ అంతకంటే ముందుగానే పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించామని చెప్పారు. అక్కడినుంచి బీచ్‌రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం ఎదురుగా రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న టీయూ 142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ మ్యూజియాన్ని డిసెంబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిస్తారని చెప్పారు.
విదేశీ పర్యటనకు సీఎం: సీఎం చంద్రబాబు మూడు దేశాల పర్యటనకోసం మంగళవారం బయల్దేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖ నుంచి నాగపూర్ వెళ్లారు. రాత్రి అక్కడ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం అక్కడి నుంచి అమెరికాకు పయనమయ్యారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఆయన అమెరికా, దుబాయ్, లండన్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలువురు రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు, ముఖాముఖీ సమావేశాలు, బహుముఖ చర్చలతోపాటు వివి«ద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment