‘పాస్‌పోర్ట్’ రాజధానిగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పాస్‌పోర్ట్ సేవల కేంద్ర బిందువుగా విశాఖపట్నం అవతరించనుంది. ఈ దిశగా విశాఖలోని పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాఖ నగరంలోని పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో 18 కౌంటర్లున్నాయి. విజయవాడ, తిరుపతిల్లోని సేవాకేంద్రాల్లో ఒక్కోచోట 11 కౌంటర్లున్నాయి. విశాఖను ప్రధాన కార్యాలయంగా చేయడం కోసం మరో 12 కౌంటర్లను నెలకొల్పనున్నారు.
పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో ఆ మేరకు అవకాశం లేకపోవడంతో రీజనల్ కార్యాలయం భవనంలోని రెండు అంతస్తులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. విజయవాడ, తిరుపతిల్లోని కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయవాడ, తిరుపతిలతో పాటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరో 10 కౌంటర్లు పెంచకపోతే కష్టమని పాస్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు.
పాస్‌పోర్టులను త్వరితగతిన అందించాలనే లక్ష్యంతో ఈ నెల 15, 16 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాస్‌పోర్ట్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత తణుకు, నరసాపురాల్లోను, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, రాజమండ్రిల్లోను క్యాంపులు నిర్వహించనున్నారు. ఒక్కో క్యాంపులో సగటున 900 పాస్‌పోర్ట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.