రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి. ఆహ్లాదకర వాతావరణం, కనువిందు చేసేలా సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించాలి. చివరి దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, ఇతరత్రా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో పనుల సీజన్ మొదలైందన్నారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీటి సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా తాగు నీటిని ఆదా చేయాలని చెప్పారు.
ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లోని పరిశ్రమలు డీ–శాలినేషన్ చేసిన సముద్రపు నీటిని వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలోని అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
ఆహ్లాదకరంగా విజయవాడ
► విజయవాడలో అంబేడ్కర్ స్మృతి వనం, కన్వెన్షన్ సెంటర్ పనులను వేగంగా పూర్తి చేయాలి. పార్కులో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కాలువల పరిశుభ్రతపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అత్యాధునిక యంత్రాలను వినియోగించాలి. విమానాశ్రయానికి వెళ్లే మార్గం అంతటా ఆకర్షణీయంగా.. ప్రయాణికులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టాలి. ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానదిని ఆనుకుని నిర్మించిన రక్షణ గోడ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి.
► రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన సుందరీకరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గోదావరి నదిపై హేవ్‌లాక్ బ్రిడ్జిని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలి.
► వరదల కారణంగా నెల్లూరు మునిగిపోయే పరిస్థితి రాకూడదు. ప్రజలు ఇబ్బంది పడకుండా రక్షణ గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.
► టిడ్కో ఇళ్ల నిర్వహణను ప్రాధాన్య అంశంగా తీసుకోవాలి. పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలి.
మానవ వనరుల్లో సాంకేతిక విజ్ఞానం పెంచాలి
► నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాం. ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్‌టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు తదితర వాటిని తీసుకొస్తున్నాం.
► పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఇలాంటి ప్రాజెక్టుల సమగ్ర నిర్వహణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ) పెట్టుకోవాలి.
విశాఖలో ప్రగతి వీచిక
విశాఖపట్నంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందుగా రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు విశాఖ ప్రగతిని సీఎంకు వివరించారు. నాలుగేళ్లలో రూ.3,592 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రహదారులతో పాటు డ్రెయిన్లు, నీటి సరఫరా, వీధి లైట్లు, పార్కులు, వాటర్ బాడీలు, సుందరీకరణ, మురుగు నీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణంతో పౌరులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించామన్నారు. మరో రూ.300 కోట్లతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. మూడు వరసల్లో పార్కు, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
పురపాలక, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, అర్బన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి.సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్.జె.విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి.రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment