విశ్వభారతి అసుపత్రిలో సదుపాయాలను పరిశీలిస్తున్న కలెక్టర్ జి.వీరపాండియన్
కర్నూలు(సెంట్రల్): కరోనా బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు కోడుమూరు సమీపంలోని విశ్వభారతి ప్రైవేట్ మెడికల్ కాలేజీని కోవిడ్–19 ఐసోలేషన్ హాస్పిటల్‌గా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఆదివారం ఆయన ఆ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని.. ప్రజలు రోడ్లపైకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
విదేశాల నుంచి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారిని జియోట్యాగింగ్ చేసి వారి ప్రతి కదలికపై నిఘా ఉంచామన్నారు. నగరంలో చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలు కోసం గుమికూడుతున్నారని.. ఇది మంచిది కాదని సామూహిక దూరం పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ మత ధార్మిక కార్యక్రమానికి హాజరై వచ్చిన 21 మందిని సి. బెళగల్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైన ఉచిత బియ్యం, కేజీ బ్యాళ్ల పంపిణీలో సుమారు లక్ష మంది పేదలు సరుకులు తీసుకున్నారన్నారు. ప్యాకింగ్ ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల బ్యాళ్లు అందలేదని, నేటి నుంచి అన్ని సరుకులు అందుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment