ఉపాధి పథకం
బొబ్బిలి రూరల్ : బొబ్బిలి మండలంలో ఉపాధి పథకం ఏపీఓ ఎవరన్నది సందేహాస్పదంగా మారింది. ఈ నెల 9న డ్వామా పీడీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీలను తెర్లాం మండలానికి, అక్కడి ఏపీఓ కె.కేశవరావును బొబ్బిలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 12న ఎంపీడీఓ ఆర్‌వి.పద్మజకు ఆదేశాలు అందాయి. ఈ నెల 18న తెర్లాం ఏపీఓ కె.కేశవరావు బొబ్బిలిలో విధుల్లో చేరారు. కానీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీల మాత్రం బొబ్బిలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే ఫీల్డుకు వెళ్లి వివరాలు విలేకరులకు తెలిపారు. తాను ఇక్కడ రిలీవ్ కాలేదని, కేశవరావు తెర్లాంలో రిలీవ్ కాలేదని ఆమె చెబుతున్నారు. అయితే కేశవరావు విధుల్లో చేరి 2, 3 రోజులలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తానని ఎంపీడీఓకు తెలిపినట్లు సమాచారం.
రిలీవ్ కావాల్సిందే..
ఏపీఓ సుశీల రిలీవ్ కావాల్సిందేనని ఎంపీడీఓ ఆర్‌వి.పద్మజ తెలిపారు. పీడీ ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు తెర్లాం ఏపీఓ కేశవరావు బొబ్బిలిలో ఈ నెల 18న విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. కె.సుశీల విధులు నిర్వర్తించినా అధికారిక కార్యక్రమాలకు ఏపీఓ కేశవరావే అని తెలిపారు.
రాజకీయ ఒత్తిడులే కారణమా..?
ఏపీఓల బదిలీకి రాజకీయ ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. టీడీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రి సోదరుడు బేబీనాయన ఈ బదిలీలకు కారకుడని సమాచారం. అయితే తాను మంత్రి సుజయ్ వద్దే విషయం తేల్చుకుంటానని ఏపీఓ సుశీల చెప్పడం గమనార్హం.
నేను విధుల్లో చేరా..
నా బదిలీ ఉత్తర్వుల మేరకు నేను ఈ నెల 18న ఏపీఓగా బాధ్యతలు స్వీకరించాను. ఎంపీడీఓకు బాధ్యతలు ïస్వీకరిస్తున్నట్లుగా పత్రాలు కూడా ఇచ్చాను.
– కె.కేశవరావు, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం నుంచి బదిలీ అయిన ఏపీఓ)
నేనే ఏపీఓని..
నేను బొబ్బిలిలో, తెర్లాంలో కేశవరావు రిలీవ్ కాలేదు. బదిలీలు అయితే అందరికీ చేయాలి. కానీ ఇద్దరినే చేయడమేంటి..? నేనే విధులు నిర్వర్తిస్తాను. ఏపీఓ నేనే. మంత్రి వద్ద విషయం తేల్చుకుంటా.
– కె.సుశీల, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం బదిలీ అయిన ఏపీఓ)
వివాదం ఏమీ లేదు..
పీడీ ఆదేశాల మేరకు ఏపీఓలు బదిలీ అయ్యారు. నేను çసుశీలకు రిలీవింగ్ ఇచ్చాను. కేశవరావును విధుల్లో చేర్చుకున్నా. ఇందులో వివాదం ఏమీ లేదు. అధికారికంగా కేశవరావు ఏపీఓ. సుశీల ఉన్నా మేమేమీ అనలేం కదా. ఆమె ఇష్టం. (ఈ మేరకు బదిలీ, జాయినింగ్, రిలీవింగ్ ఉత్తర్వులు చూపారు.)
– ఆర్‌వి.పద్మజ, ఎంపీడీఓ,బొబ్బిలి.
Comments
Please login to add a commentAdd a comment