చెల్లూరు పోలింగు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఎన్నికల క్రతువులో కీలకమైన పోలింగ్ ఘట్టం గురువారం ముగిసింది. ఓట్లు వేసేందుకు ఉదయం ఏడుగంటలనుంచే జనం బారులు తీరారు. గిరిజన ప్రాంతాలకు చెందిన వారైతే ముందురోజు రాత్రే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్‌కు సన్నద్ధం అయ్యారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినా... అప్పటికప్పుడు వాటిని చక్కదిద్దడంతో పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల అధికార పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు పెచ్చుమీరడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 76.04 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసేం దుకు ఈ సారి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాక్ పోలింగ్ నుంచి సాయంత్రం వరకు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగుకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్ది పోలింగు జరిపారు. జిల్లా ఎన్నికల అధికారి హరి జవహర్‌లాల్ వెబ్‌కాస్టింగు ద్వారా మొత్తం పోలింగు పక్రియను పర్యవేక్షించగా జిల్లా ఎస్పీ దామోదర్ శాం తి భద్రతలను పర్యవేక్షించారు. జిల్లాలో విజయనగరం, అరకు, విశాఖపట్నం పార్లమెంటు స్థానా నికి, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గురువారం పోలింగ్ నిర్వహించారు.
ఉదయం 5.30గంటలకు అధికారులు మాక్‌పోలింగు నిర్వహించారు. అనంతరం 7గంటల నుంచి పోలింగు ప్రారంభమై ఓటర్లు ఓటు వేసే అవకాశం కల్పిం చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగు నిర్వహించగా బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోట నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు నిర్వహించారు.
ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు
పోలింగు కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ఓటు వినియోగంపై అధికారులు చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చినట్టయింది. ఈసారి అన్ని వర్గాల ఓటర్లు వచ్చి ఓటుహక్కు వినియోంచుకున్నారు. గతంలో ఓటింగు కు యువత, వలస ఓటర్లు దూరంగా ఉండేవారు. ఈసారి వారు కూడా తరలిరావడం విశేషం.
గతం కంటే తగ్గిన పోలింగ్
జిల్లాలో అధికారులకు సాయంత్రం 6గంటలకు అందిన సమాచారం మేరకు జిల్లాలో 76.04శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నట్లు అంచనా. పోలింగు కేంద్రాల వారీగా పూర్తిగా పోలింగు ముగిసిన తర్వాత పీఓలు ఇచ్చే సమాచారం మేరకు పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం పోలింగు శాతంలో కొంతవరకు మార్పు ఉండవచ్చు.
రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం పోలింగు శాతం చూస్తే మాత్రం 2014 సార్వత్రిక ఎన్నికల కంటే తగ్గిందని చెప్పాలి. అప్పట్లో 79.5శాతం నమోదైంది. ఏదైనా పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలో పోలింగు ప్రక్రియకు పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పలు మార్లు అంతరాయం ఏర్పడింది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లు మాక్ పోలింగు సమయంలోనే కొన్ని మొరాయించగా పోలింగు ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురైంది. అధికారిక సమాచారం ప్రకారం మా క్ పోలింగు సమయంలో 9అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 బ్యాలెట్ యూనిట్లు, 38 కంట్రోల్ యూనిట్లు, 71 వీవీ ప్యాట్‌లు పని చేయకపోవడంతో మార్చారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబం«ధించి 31 బ్యాలెట్ యూనిట్లు, 38 కంట్రోల్ యూనిట్లు, 70 వీవీ ప్యాట్‌లు మొరాయించడంతో మార్చారు. పోలింగు ప్రారంభమైన తర్వాత 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 51 బ్యాలెట్ యూనిట్లు, 57 కంట్రోల్ యూనిట్లు, 109 వీవీ ప్యాట్‌లు పని చేయలేదు.
పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 62 బ్యాలెట్ యూనిట్లు, 63 కంట్రోల్ యూనిట్లు, 108 వీవీ ప్యాట్‌లు మొరాయించాయి. వీటన్నింటినీ అధికారులు మార్చారు. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డంతో అనేక చోట్ల ఈవీఎంలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలు మొరాయిం చడం వల్ల జిల్లాలో 60కు పైగా పోలింగు కేంద్రాల్లో గంట నుంచి 2గంటల ఆలస్యంగా పోలింగు ప్రారంభమైంది. 100కుపైగా పోలింగు కేంద్రాల్లో పోలింగు నిలిచిపోయింది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలింగు పక్రియను పరిశీలించిన కలెక్టర్
జిల్లాలో పోలింగు పక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నుంచి పరిస్థితిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈవీఎంలు మొరాయించిన చోట వాటిని రీప్లేస్ చేయడం, సరి చేయడం వంటి విషయాలపై మార్గదర్శకం చేశారు. అదేవిధంగా ప్రతి గంటగంటకు పోలింగు తీరును పరిశీలిస్తూ పోలింగు శాతం తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మధ్యలో కలెక్టర్ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న చెల్లూరు పోలింగు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌తో కలిసి పరిశీలించారు.
పోలింగును పర్యవేక్షించిన నేతలు
పార్టీ నాయకులు కూడా పోలింగు తీరును నిరంతరం పర్యవేక్షించికుని ఎప్పటికప్పుడు ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ చీపురుపల్లితోపాటు పలు నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితిని పరిశీలించారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగతా అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల పరిధిలో పోలింగు తీరును తెలుసుకున్నారు. తెలుగుదేశంపార్టీ ఎంపీ అభ్యర్ధి ఆశోక్‌గజపతిరాజు పలు నియోజకవర్గాల్లో పర్యటించగా మిగతా అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో వారు ఉన్నారు.
ఓటు వినియోగించుకున్న ప్రముఖులు
పోలింగు సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ హరి జవహర్‌లాల్ దంపతలు, ఎస్పీ దామోదర్ దంపతులు విజయనగరంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతర ముఖ్య అధికారులు కూడా జిల్లా కేంద్రంలోనే ఓటు వేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ముఖ్యనాయకులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎం.ఆర్.కాలేజీలో ఓటు వేయగా మిగతా అభ్యర్ధులు ఎవరి నియోజకవర్గాల్లో వారు వేశారు. ఎస్.కోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గజపతినగరం నియోజకవర్గంలో ఓటు వినియోగించుకున్నారు. తెలుగుదేశం నాయకులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment