విభజనకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ జంక్షన్‌తోపాటు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మహాసభ ప్రతినిధులంతా కళ్లకు, నోటికి, చెవులకు నల్లరిబ్బన్లు ధరించారు. ‘చెడు కనకు, వినకు, మాట్లాడకు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియాగాంధీ, గ్రూప్ ఆఫ్ మంత్రుల దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దహనం చేశారు. సోనియా గాంధీ విచిత్ర చిత్రపటాన్ని విభజన రాక్షసిగా అభివర్ణిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఆంధ్ర రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా యూపీఏ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బుధవారం జిల్లా బంద్ పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా కో-కన్వీనర్ మద్దిల సోంబాబు, ఉపాధ్యాయ సంఘం నాయకుడు జగన్, వికలాంగుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో రాక్షస పాలన
సాలూరు, న్యూస్‌లైన్ : దేశంలో రాక్షసపాలన కొనసాగుతోందని, సోనియాగాంధీ తన నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్లె మధుసూదన్‌రావు (మధు) మున్సిపల్ మాజీ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావు అన్నారు. లోక్‌సభలో టీ బిల్లు ఆ మోదం పొందడాన్ని నిరసిస్తూ స్థానిక జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఐలాండ్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. మాజీ కౌన్సిలర్ కొల్లి వెంకటరమణ సోనియాగాంధీ వేషం ధరించి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బిల్లుకు వ్యతిరేకంగా మద్దత్తు ఇస్తామని చెప్పిన బీజేపీ కూడా మాట మార్చిందని ధ్వజమెత్తారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరి రఘు, పిరిడి రామకృష్ణ, వైకుంఠపు మధు, ఎర్ర దాలినాయుడు, వంగపండు అప్పలనాయుడు, ఈదుబిల్లి నాయుడు, తాడ్డి యశోదకృష్ణ, కిలారి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర విభజనను నిరసిస్తూ మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
Published Wed, Feb 19 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement