నారాయణఖేడ్, న్యూస్‌లైన్: పక్షం రోజుల్లో వలంటీర్లు, అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్ తెలిపారు. గురువారం నారాయణఖేడ్‌లోని బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఉన్నత పాఠశాలల్లో 500 మంది వలంటీర్ల ఏర్పాటుకు, ప్రాథమిక పాఠశాలల్లో 1,500 మంది వీవీలు, ఆర్వీఎం ద్వారా తెలుగు మీడియంలో 234 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కోసం కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించి నట్లు చెప్పారు. జిల్లాలో 746 పాఠశాలల్లో సింగి ల్ టీచర్లు ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. గతంతో పోల్చితే ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడిందని అన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించేలా పేరెంట్స్ సమావేశాలను నిర్వహించాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి ఐదారు గ్రూపులు చేసి పాఠ్యాంశాలపై క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు.
దీంతో జీకేతోపాటు, పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుందన్నా రు. ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని, ఈ సారి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కూడా విద్యపై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఒత్తిడిలు, బదిలీ చేయించే ప్రయత్నాల గూర్చి ప్రస్తావించగా ని క్కచ్చిగా తన పని తాను చేసుకుపోతానని డీఈఓ తెలిపారు. సమావేశంలో ఎంఈఓ భీం సింగ్ పాల్గొన్నారు. అంతకుముందు బాలికల ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థినులను పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలడిగారు. విద్యార్థులు వెంటవెంటనే సమాధానాలు చెప్పడంతో బోధనపై డీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని అసౌకర్యాలను ఈ సందర్భంగా విద్యార్థినులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. మినరల్‌వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా ప్రణాళికాసంఘం మాజీసభ్యుడు నగేష్ షెట్కార్‌లు గతంలో హామీనిచ్చారని విద్యార్థినులు పేర్కొనగా డీఈఓ ఎంపీతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో ఏర్పాటు చేయిస్తామని ఎంపీ హామీనిచ్చారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ భీంసింగ్, పాఠశాల హెచ్‌ఎం ఇందిరా కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.