తిరుపతి కార్పొరేషన్,న్యూస్‌లైన్: ‘మీ పదవులు, పార్టీలను పక్కన పెట్టండి. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమించండి’ అని చిత్తూరు ఎమ్మెల్యే, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ సీకే బాబు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సీకే బాబు చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీకేబాబు మాట్లాడారు.
సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం ఏ ఒక్కరి బలవంతం మీద చేస్తున్నది కాదన్నారు. ‘మీ వెంట మేముంటాం, మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని’ ప్రజలు రోడ్లపైకొచ్చి కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎంతో మంది మేధావులైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ విభజనను అడ్డుకోకుండా మౌనంగా ఉండడం సరికాదని హితవుపలికారు. గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో నిరంకుశమైన దొరలరాజ్యం నడుస్తోందని, అందుకే సీమాంధ్ర వారిని రెచ్చగొట్టేలా వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మబ్బు చెంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సీకేకు ఘన స్వాగతం: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టిన సీకేబాబు శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. టౌన్‌క్లబ్ వద్ద సీకేకు ఐఎన్‌టీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మబ్బు చెంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమాస రాజశేఖర్‌రెడ్డి, తిరుపతి అధ్యక్షులు నాగభూషణం, నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మబ్బు యువసేన నాయకులు, సమైక్యవాదులు 2వేల మందికి పైగా పూలు చల్లుతూ, టపాకాయలు పేల్చుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు టౌన్‌క్లబ్ వద్ద ఏపీఎన్జీవోలు, నాలుగు కాళ్లమండపం వద్ద కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు, మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సాప్స్ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు సీకే బాబు సంఘీభావం తెలిపారు.
పదవులను వీడి ఉద్యమంలోకి రండి
Published Sat, Aug 24 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement