
ప్రాజెక్టులపై పోరాడుదాం రండి
కడప కార్పొరేషన్: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటంలో తెలుగుదేశం కలిసి రావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగునీరు, తాగనీటి అవసరాల కోసం అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించాక జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయన్నారు.
టీడీపీ ప్రభుత్వం జిల్లాపై అడుగడుగునా వివక్ష చూపుతుండడంతో సాగునీరు కాదుకదా, తాగునీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపడంలేదని టీ డీపీ నాయకులు చెబుతున్నారని, అయితే సీఎం జిల్లాపై ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి చేసే పోరాటానికి అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని పిలుపునిచ్చామన్నారు. ఇందుకు వివిధ రాజకీయపార్టీలు తమ అంగీకారం తెలిపాయన్నారు.
ఈ మేరకు ఈనెల 26, 27 తేదీలలో పోతిరెడ్డిపాడు వద్ద 24వ ప్యాకేజీ మొదలుకుని 30వ ప్యాకేజీ వరకూ క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తీర్మానించామన్నారు. బనకచెర్ల, గోరకల్లు, అవుకు ప్రాంతాలలో ఏఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.. పూర్తి కావాలంటే ఎన్ని నిధులు కావాలి.. తదితర విషయాలను పరిశీలిస్తామన్నారు. అనంతరం ఈనెల 27వ తేదీ జిల్లాకు రానున్న సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, 28వ తేదీ గండికోటకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
సర్వరాయసాగర్ పూర్తి చేయాలని కమలాపురం ఎమ్మెలే దీక్ష
ఈ కార్యక్రమం ముగియగానే సర్వరాయ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయనున్నారని ఆకేపాటి చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజక్టుకు రూ.1500 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీరు- చెట్టు కార్యక్రమానికి రూ.27 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానికంటే ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
క్రిష్ణా, గోదావరి, పెన్నా నీటిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ తర్వాతే నీరు- చెట్టు గూర్చి ఆలోచించాలని సూచించారు. తెలుగుగంగ లైనింగ్ పనులను వెంటనే పూర్తి చేయకపోతే ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసుకోలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛెర్మైన్ విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.