అంగరంగ వైభవం..రాములోరి రథోత్సవం
♦ భారీగా తరలి వచ్చిన భక్తజనం
♦ రామనామస్మరణతో మార్మోగిన ఏకశిలానగరం
ఒంటిమిట్ట : ‘జయ జయ రామ.. జానకి రామ.. పావన రామ.. పట్టాభి రామ’ అంటూ అంటూ భక్త జనం రామ నామ స్మరణ చేస్తుండగా సీతా లక్ష్మణ సమేతంగా కోదండ రామయ్య ఒంటిమిట్ట వీధుల్లో రథంలో ఊరేగారు. ఆ కమనీయ దృశ్యం తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. అంతకు ముందు సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ మిన్నంటుతుండగా రథ చక్రాలు ముందుకు కదిలాయి.
ఏకశిలా నగరం భక్తజనంతో పోటెత్తింది. రాములోరి ఎత్తయిన ఆలయ ప్రధాన గోపురానికి ధీటుగా, గంభీరంగా భక్తుల జేజేలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుండగా జనసంద్రం మధ్యన సాగిన జగన్నాయకుని రథం ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టం. రథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లను ఒళ్లంతా కళ్లు చేసుకుని తిలకించి పరవశించిన భక్తజనం...చూసిన వారికి పుణ్యఫలం. రథ సేవ చేసిన వారి జన్మధన్యం. - ఒంటిమిట్ట
వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి రథోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రామయ్యకు విశేష పూజలు నిర్వహించి రథోత్సవం ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య కోదండరాముడు రథంపై ఊరేగాడు. సీతారామలక్ష్మణుల దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించి తరించారు. - ఒంటిమిట్ట