ఇలాగైతే రైతుల పరిస్థితేంటి?
♦ ఏడాదికి ఒక్క తడితో సరిపెడతారా.. పంటలను ఎలా సంరక్షించుకోవాలి?
♦ ఏమీ లేకున్నా.. శాలువాలతో సన్మానాలు చంద్రబాబుకే చెల్లు
♦ చిత్రావతి రిజర్వాయర్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో వైఎస్ జగన్మోహన్రెడ్డి
♦ ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న వైఎస్ జగన్
♦ కమలాపురం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
సాక్షి, కడప/పులివెందుల : ‘ప్రస్తుత పరిస్థితులలో.. వేసవి నేపథ్యంలో నెలకు మూడు తడులు అవసరం.. కానీ ఏడాదికంతా కలిపి 12 వేల ఎకరాలకు కేవలం ఒక్క తడి నీరు అందించిన చరిత్ర ఇక్కడే చూస్తున్నాం.. 1.25 లక్షల ఎకరాలు ఉన్న ఆయకట్టు, పులివెందుల నియోజకవర్గం, మున్సిపాలిటీకి కేవలం .063 టీఎంసీల నీరు ఏ మూలకు సరిపోతుంది? ఈ కాస్త నీరు అటు సాగు, ఇటు తాగడానికి సరిపోవడం లేదు.
పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే టీడీపీ ప్రభుత్వంలో భారీగా వచ్చిన నీటితో సాగు, తాగునీరు సమస్య తీరిపోయిందని సన్మానాలు చేయించుకోవడం చంద్రబాబుకే చెల్లింద’ని వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఆయన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ఆర్సీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఈ ఏడాదికి సంబంధించి 4.64 టీఎంసీల నీటిని కేటాయించి.. నాలుగు విడతల్లో నీటిని విడుదల చేయగా... సీబీఆర్‌కు చేరింది 2.55 టీఎంసీల నీరు మాత్రమేనన్నారు. అందులో 1.50 టీఎంసీల నీరు అనంత, వైఎస్ఆర్ జిల్లాల్లోని తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారన్నారు. మిగిలిన 1.013 టీఎంసీల నీటికి సంబంధించి సీబీఆర్‌లో డెడ్ స్టోరేజ్ అనగా .95 టీఎంసీ నీరు ఉంచాల్సి ఉందన్నారు.
మిగిలిన .063టీఎంసీ నీటిని సాగునీటికి అందిస్తారా.. తాగునీటికి అందిస్తారా.. అందులో లాసెస్ పరిస్థితి ఏమిటి..అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే ఉన్న పీబీసీ ఇన్‌ఛార్జి ఈఈ మక్బుల్ బాషాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, పులివెందుల రూరల్, అర్బన్, యూసీఐఎల్ ప్రాజెక్టులకు వెళుతున్న నీటికి సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు.
అనంతరం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి 177 గ్రామాలకు తాగునీటిని అందించే పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అక్కడే మోటార్ల పరిస్థితి, పంపింగ్ చేసే విధానంపై ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పర్వతరెడ్డి, డీఈ మోహన్‌కుమార్‌లతో చర్చిం చారు. ప్రస్తుతం పనిచేస్తున్న 200, 100హెచ్‌పి మోటార్లతోపాటు మరికొన్ని అదనంగా పెట్టుకొని పంపింగ్ చేయాలని సూచించారు.
ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకున్న వైఎస్ జగన్ :
శుక్రవారం ఉదయాన్నే బయలుదేరి నేరుగా ఒంటిమిట్టకు చేరుకున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీతారామ,లక్ష్మణ స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బైకులతో ర్యాలీ.. :
కడప నుంచి కమలాపురంకు వస్తున్న వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వల్లూరు నుంచి కమలాపురం వరకు బైకులకు జెండాలు కట్టి కాన్వాయ్ ముందు ర్యాలీగా సాగింది.
కమలాపురంలో దర్గాలో ప్రార్థనలు
కమలాపురం దర్గాలో ఉరుసు మహోత్సవాన్ని పురష్కరించుకొని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. దర్గా కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘన స్వాగతం పలికారు.
దారి పొడవునా నీరాజనం
వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం బయలుదేరి ఒంటిమిట్టకు వెళుతున్న సందర్భంలోనూ.. తిరిగి కమలాపురం వెళుతున్న సమయంలో ఎక్కడ చూసినా గ్రామాల వద్ద ఆపుతూ జనం వైఎస్ జగన్‌కు హారతులు పట్టారు. కడప సమీపంలో కార్యకర్తలు వచ్చి కాన్వాయ్‌ని ఆపి వైఎస్ జగన్‌ను పలకరించారు. అనంతరం బాకరాపేట వద్ద, ఒంటిమిట్ట, ఇర్కాన్ సర్కిల్, వల్లూరు, రైల్వే గేటు, కమలాపురం బ్రిడ్జి, నాలుగు రోడ్ల సర్కిల్ ఇలా ఎక్కడ చూసినా జగన్ కాన్వాయ్‌ని ఆపి జనాలు ప్రతిపక్షనేతను కలిశారు. లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకులు రమేష్, ధనుంజయల ఇళ్లకు వైఎస్ జగన్ వెళ్లి పలకరించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాసేపు..
వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం పలువురు నేతలు కలిశారు. శుక్రవారం ఉదయాన్నే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్ బాషా, జయరాములు, కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, నెల్లూరు జిల్లా జడ్పీ చెర్మైన్ రాఘవేంద్రారెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, యల్లనూరు మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు పెద్దారెడ్డి తదితరులు వైఎస్ జగన్‌తో చర్చించారు.