సోంపేట(కవిటి), న్యూస్‌లైన్: శుక్రవారం సాయంత్రం వారందరినీ కుసుంపురంలోని పునరావాస కేంద్రానికి తరలించారు..శనివారం ఉదయం తుఫాన్ ప్రభావం పెద్దగా కనిపించలేదు..దీంతో ఏమీ కాదులే.. అన్న ధీమాతో వారంతా స్వగ్రామానికి వెళ్లిపోయారు.మధ్యాహ్నానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈదురు గాలులు మొదలై సాయంత్రానికి ప్రచండ వేగం అందుకున్నాయి. వాటికి తోడు భారీ వర్షం. సాయంత్రం 6 గంటల తర్వాత పరిస్థితి గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఫలితం.. ఆ గ్రామస్తుల పరిస్థితి నరకంలో చిక్కుకున్నట్లయ్యింది. రెండు రోజులపాటు అదే ఎలా గడిపారో వారు చెబుతుంటేనే.. గగుర్పాటు కలిగింది. స్వయంగా అనుభవించిన వారెంత నరకయాతన అనుభవించారో!.. మంగళవారం కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణించి అతి కష్టం మీద ఒంటూరు గ్రామానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ విలేకరికి అక్కడి ప్రజలు తాము అనుభవించిన వ్యథను కళ్లకు కట్టారు.
కవిటి మండలంలో సముద్ర తీరంలో ఉన్న గ్రామం ఒంటూరు. మంగళవారం నాటికి కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా కునారిల్లుతోంది. శుక్రవారం సాయంత్రం పునరావాస కేంద్రానికి తరలివెళ్లిన గ్రామానికి చెందిన 250 మంది శనివారం ఉదయం తుఫాన్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నం నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. తుఫాన్ విలయంలో చిక్కుకున్నారు. గ్రామంలోకి నీరు చొచ్చుకొచ్చింది. రెండురోజులు పాటు దిగ్బంధించింది. శనివారం సాయంత్రం ఒకటి రెండుసార్లు అధికారులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్లు పని చేయడం మానేశాయి. దాంతో సహాయం కోరు అవకాశం కూడా లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశారు. మంగళవారం గ్రామానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఒక్క అధికారి కూడా రాలేదు.
ఎలా ఉన్నామని పలకరించేవారు కూడా లేరు. రెండురోజులుగా గ్రామంలో నీరు నిలబడిపోయింది. కనీసం వంట చేసుకుందామన్నా అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వెళ్లబోసుకున్నారు. కష్టం చెప్పుకొనేందుకు మనిషి దొరికాడన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక దశలో శనివారం రాత్రి మా పని అయిపోయిందనే అనుకున్నామని.. ఆదివారం తెల్లవారి తుఫాను ప్రభావం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. రెండురోజులు ఆహారం లేక పిల్లాపాపలతో చాలా ఇబ్బందులు పడ్డామని గుండెల్లో దాచుకున్న బాధను వెళ్లగక్కారు. ఈ రోజు వరకు గాంజి కాచుకొని తింటున్నామని వెల్లడించారు. తాగడానికి గ్రామ బావిలోనే బురదనీరే గతి అని చెప్పారు. గ్రామం నుంచి బయటకు వెళ్లే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఒంటూరుతో పాటు పక్కనే ఉన్న కళింగపట్నం ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. కళింగపట్నం దగ్గర బ్రిడ్జి దిగువన వేసిన తాత్కాలిక కంకర రోడ్డు కొట్టుకుపోవడంతో తెప్పపై ఆ ఊరికి వెళ్లాల్సి వస్తోంది.
వినూత్నంగా చార్జింగ్ చేసిన యువకుడు
ఒంటూరు ప్రజల బాగోగుల గురించి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి బంధువులు ఆందోళన చెందుతుంటారని గుర్తించిన గ్రామానికి చెందిన యువకుడు గుడియా రామారావు వారికి చేతనైన సాయం చేయాలన్న సంకల్పంతో సొంత ప్రతిభతో తన సెల్‌కి చార్జింగ్ చేశాడు. ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ టార్చిలైట్‌లోని బ్యాటరీ తీసి, దాన్ని మొబైల్ ఫోన్ బ్యాటరీతో అనుసంధానం చేసి చార్జింగ్ చేశాడు. ఆ ఫోన్ ద్వారా గ్రామస్తుల బాగోగులను వారి బంధువులకు చేరవేసి సహకరిస్తున్నారు.
బురద నీరే గతి
గ్రామంలో తాగడానికి నీరు లేదు. మంచినీటి బావి మొత్తం బురదగా మారింది. ఆ నీరే మరగబెట్టి తాగుతున్నాం.
-ధనుంజయరావు, ఒంటూరు
ఒక్క అధికారీ రాలేదు
తుఫాను తరువాత నేటికి గ్రామానికి ఒక్క అధికారి గానీ, నాయకులు గానీ రాలేదు. రెండురోజులు పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం.
-రామారావు, ఒంటూరు
ఏం జరుగుతుందో తెలియదు
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యడం లేదు. గ్రామానికి వెళ్లాలంటే తెప్పల మీద ఆధారపడాల్సి వస్తుం ది. అధికారులు స్పందించాలి.
-ఎస్.కూర్మమ్మ, కళింగపట్నం
జల దిగ్బంధంలో ఒంటూరు గ్రామం
Published Wed, Oct 16 2013 6:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement