ఓటు.. తిరుగుబాటు! | Vote ..Revolt! | Sakshi
Sakshi News home page

ఓటు.. తిరుగుబాటు!

Published Fri, Mar 17 2017 10:57 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

Vote ..Revolt!

► శిల్పాకు ఓటేయడంపై భూమా వర్గం కినుక
► తమపై కేసులు పెట్టిన వారికి ఎలా సహకరించేదని మండిపాటు
► ఆందోళనలో అధికార పార్టీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
తమపై అక్రమ కేసులు బనాయించి.. ఇన్ని రోజులు మానసికంగా హింసించిన వ్యక్తికి తాము ఎలా ఓటు వేస్తామని నంద్యాల, ఆళ్లగడ్డలోని భూమా అనుచరులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఇప్పుడు తమను అడిగితే సానుకూలంగా ఎలా స్పందిస్తామని భూమా అనుచర ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు సూటిగా నిలదీస్తున్నారు. ఎన్నికల్లో గెలుపునకు తమను ఉపయోగించుకుంటామంటే ఎలా సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు.
 
తమ నేతను కూడా మంత్రి పదవి ఆశ చూపి కరివేపాకులా వాడుకుని వదిలేసిన అంశాన్ని తాము ఎలా మర్చిపోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమపై నమ్మకం లేదని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న వ్యక్తికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని భూమా నాగిరెడ్డి కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు కూడా తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిలో ఆందోళన మొదలైనట్టు తెలిసింది.
 
నమ్మకం లేదన్నారుగా..!
వాస్తవానికి తాము ఓటేస్తామన్న నమ్మకం అభ్యర్థికి లేదని ఈ నేతలు వాదిస్తున్నారు. అందుకే తాము ఓటు వేయమనే అపనమ్మకంతోనే ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేసిన శిల్పా వర్గం ఇప్పుడు తమను ఓటు అడగటం ఎంత వరకు సమంజసమని భూమా అనుచరులు అంటున్నారు. కేవలం తమ నేతను లక్ష్యంగా చేసుకుని మానసికంగా హింసించి చనిపోవడానికి కారణమైన పార్టీకి కూడా తాము ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇది ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూర్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా కూడా తమపై కేసు నమోదైన విషయాన్ని వీరు ఉదహరిస్తున్నారు. ఓటు వేయకపోతే పనులు కావంటూ తమను పరోక్షంగా హెచ్చరిస్తున్నారనే అంశాన్ని కూడా వీరు చర్చించుకుంటున్నారు. అంటే ముందుగానే తాము ఓటు వేయమని.. వేయకపోతే బెదిరింపులకు దిగితే తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కాస్తా వర్గపోరుకు వేదికగా మారినట్లు తెలుస్తోంది. 
 
విందులు.. వినోదాలు
అధికారపార్టీ నేతల్లో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో భారీగా విందులు, వినోదాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఓటుకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకూ పంచుతున్నారు. ఇప్పటికే గోవా, ఊటీల్లో క్యాంపులు వేసిన అధికారపార్టీ నేతలు.. విందులు, వినోదాలు ఇస్తూ కూడా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అనుమానం ఉండటంతో.. తమ వద్ద డబ్బులు తీసుకుని మళ్లీ ప్రతిపక్షానికి ఓటు వేస్తే రావద్దొంటూ తమ వద్దకు వచ్చిన నేతలతో వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో తమను అవమానించినట్టేనని మదనపడుతున్నారు. మొత్తం మీద అధికారపార్టీలో గతంలో గెలిచిన తరహాలో పోటీ సులువగా లేదని.. పైగా ఓటమి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement