ఆలంపల్లి, న్యూస్‌లైన్: పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతి, డీజీపీ ప్రసాదరావు వాహనాలను అడ్డుకున్నారు. ఆదివారం అనంతగిరి అడవిలో జింకలు వదిలే కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న వారి వాహనాలను సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట అడ్డుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
‘లాఠిన్యం’తో పలువురికి గాయాలు..
చాలీచాలని జీతాలతో తమ బతుకు దుర్భరంగా మారిందని వీఆర్‌ఏలు వికారాబాద్ పట్టణంలో మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అనంతగిరికి వచ్చిన సీఎస్ పి.కె మహంతికి వినతిపత్రం ఇవ్వాలని భావించామని, వాహనాలు అడ్డుకోవాలని తమ ఉద్దేశం కాదని వీఆర్‌ఏలు తెలిపారు. పోలీసుల చేతుల్లో చావుదెబ్బలు తినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు తాము ఉదయం నుంచి పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. మరోమార్గం లేక సీఎస్, డీజీపీ వాహనాలను అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
కాగా అంతకు ముందు రోడ్డుపై బైఠాయించిన వీఆర్‌ఏలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోనే సీఎస్, డీజీపీ వాహనాలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి రంగంలోకి దిగి సిబ్బందితో కలిసి ఆందోళనకారులను చితకబాదారు. అధికారుల తీరుకు నిరసనగా సీఐటీయూ డివిజన్ కార్యద ర్శి మహిపాల్ నినాదాలు చేయడంతో పోలీసులు ఆయనపై తమ ప్రతాపాన్ని చూపించారు. బూటు కాళ్లతో తన్నడంతో మహిపాల్ రోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిరసనలో పాల్గొన్న పలువురు మహిళలను కూడా పోలీసులు తోసేశారు. నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టి సీఎస్, డీజీపీ వాహనాలను పంపించి వేశారు. కాగా భద్రత చర్యల్లో పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని డీజీపీ అసహనం,ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా వాహనాలను అడ్డుకున్న పదిమందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ లచ్చిరాంనాయక్ తెలిపారు.
విధులు నిర్వహిస్తున్నారా..? లేక నిద్ర పోతున్నారా..?
వీఆర్‌ఏలు అడ్డుకుంటున్న సమాచారం తనకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన సిబ్బందిపై ఎస్పీ రాజకుమారి మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్నారా..? నిద్రపోతున్నారా.? అని తీవ్రంగా మందలించారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు..? సెట్‌లో సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వివరణ ఇవ్వాలంటూ ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలీసుల దాడి అమానుషం..
సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించేందుకు వచ్చిన తమపై పోలీసులు లాఠీలతో దాడి చేయడం అమానుషమని జిల్లా వీఆర్‌ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.నర్సింలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం ఖండించారు.
వీఆర్‌ఏల కలకలం
Published Mon, Jan 20 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement