సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న రాష్ట్రంలోని 23వేల మంది రెవెన్యూ సిబ్బంది కష్టాలు ఎప్పటికి తీరుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడుస్తున్నా.. నిరవధిక సమ్మె చేపట్టినా.. నిర్వేదంతో ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నా ప్రభు త్వం మాత్రం తమపై కనికరం చూపడం లేదని వీఆర్‌ఏలు వాపోతున్నారు. సమ్మె పూర్తయి ఆరునెలలవుతున్నా నేటికీ తమ డిమాండ్లు హామీలుగానే మిగిలిపోయాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
మూడే ప్రధాన డిమాండ్లు
వీఆర్‌ఏలు ప్రధానంగా మూడు డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు పేస్కేల్ వర్తింపజేయాలని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కలి్పంచాలని, 50 ఏళ్లుపైబడిన వీఆర్‌ఏల వారసులకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు, మంత్రి కేటీఆర్, అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలితాన్ని ఇవ్వకపోగా, గత ఏడాదిలో 80 రోజుల పాటు చేసిన నిరవధిక సమ్మె తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మిగిలిపోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ తమ గోడు ప్రభుత్వానికి చెప్పే ఉన్నతాధికారి (సీసీఎల్‌ఏ) లేరని భావించామని ఇప్పుడు కొత్త సీసీఎల్‌ఏగా నవీన్ మిత్తల్ బాధ్యతలు చేపట్టినా పరిస్థితి అలానే ఉందంటున్నారు.
అంబేడ్కర్ జయంతి నాటికి
రాష్ట్ర ప్రభుత్వంపై మరోమారు ఒత్తిడి పెంచాలని వీఆర్‌ఏల జేఏసీ భావిస్తోంది. అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్14) సందర్భంగానైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో మరోసారి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. ఏప్రిల్15న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలనే యోచనలో ఉన్నారు.
సీఎంపై ఇంకా నమ్మకముంది
తరతరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్న తమను గుర్తించి తెలంగాణ రాగానే జీతాలు పెంచింది సీఎం కేసీఆరే. వీఆర్‌ఏలను పేస్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది కూడా ఆయనే. కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతున్నప్పటికీ మాకు కేసీఆర్‌పై నమ్మకం ఉంది. రాష్ట్రంలోని 23వేల మంది వీఆర్‌ఏలకు ఆయన న్యాయం చేస్తారనే భరోసాతో ఉన్నాం.
– కర్ణకంటి రాజేశ్, డైరెక్ట్ రిక్రూటీ వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment