సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, తర్వాత వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో త్వరలో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి పోస్ట్ కాలగర్భంలో కలిసిపోనుంది. ఇప్పటికే VRA, VRO వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంత మందికి ప్రమోషన్ల కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలు పనిచేస్తున్నారు. వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.
త్వరలో ఆర్డీవో వ్యవస్థను తీసివేసి వీరిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో 300 బెడ్స్ ఉన్నాయి.
కాగా, ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి?. వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో సర్కారు దవాఖానాలకు పట్టిన నిర్లక్ష్యం జబ్బుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త ట్రీట్మెంట్ ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment