
వీవీ ప్యాట్.. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి.. చర్చా దీనిపైనే..గత నెలలో జరిగిన సార్వత్రిక పోలింగ్‌లో ఓటు వేసిన వారందరూ ఈవీఎంలతోపాటు దీన్ని చూసే ఉంటారు.. అందులో తాము వేసినవారికే ఓటు పడిందో లేదో చూసుకొని నిర్థారించుకొని ఉంటారు..ఇప్పుడెందుకు అందరి దృష్టీ వీటిపైనే అంటే.. ఎన్నిక ఫలితం అధికారికంగా ప్రకటించడానికి ఈవీఎంలతోపాటు ర్యాండమ్‌గా లెక్కించే వీవీ ప్యాట్ల స్లిప్పులనే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఆ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డ్రా పద్ధతిలో ఐదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు చొప్పున మొత్తం 35 వీవీ ప్యాట్లను నిర్ణయించి.. వాటి స్లిప్‌లను లెక్కించాలని.. వాటి సంఖ్య ఆ వీవీ ప్యాట్‌కు అనుసంధానమైన ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్యతో సరిపోల్చి ఫలితం ప్రకటించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఎన్నికల అధికారులు ఆ ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు.ఒకవేళ ఈవీఎం ఓట్లకు దానికి అనుసంధానమైన వీవీప్యాట్ ఓట్ల సంఖ్యకు తేడా వస్తే మళ్లీ లెక్కిస్తారు.. అప్పటికీ తేడా ఉంటే వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకొని ఫలితాన్ని నిర్ణయిస్తారు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున లెక్కింపు పూర్తి అయినా అధికారిక ప్రకటన ఆలస్యం కావచ్చు.
సాక్షి, విశాఖపట్నం: వీవీ ప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్రెయిల్.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ వీవీప్యాట్ ఓట్లే (స్లిప్పులు) ఇప్పుడు కీలకంగా మారాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల్లో ఓట్ల లెక్కింపుతోనే విజేతలెవరలో తేలిపోతుంది. కానీ వీవీ ప్యాట్ల స్లిప్పుల గణన తర్వాతే ఫలితాలు ప్రకటించనున్నారు. దాంతో వీవీప్యాట్లలో స్లిప్‌లను ఎలా లెక్కిస్తారు? వాటిలోని స్లిప్‌లకు, ఈవీఎంల్లో ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే ఏం చేస్తారు? అన్న అంశాలు ఆసక్తికరం.
ఈవీఎంకు అనుసంధానంగా..
కంట్రోల్ యూనిట్లతో పనిచేసే ఈవీఎంలకు అనుబంధంగా వీవీప్యాట్‌లను తీసుకొచ్చారు. ఈవీఎంలో గుర్తుకు ఎదురుగా ఉండే బటన్ నొక్కగానే బీప్ అని సౌండ్ రాగానే మన ఓటు నమోదైనట్లు లెక్క. కానీ ఆ ఓటు తాను నొక్కిన గుర్తుకే పడిందా.. లేక వేరే గుర్తుకు పడిందా.. అనే సందేహాలుండేవి. వీటిని నివృత్తి చేసేందుకే తొలిసారి వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈవీఎంలో గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కిన తర్వాత సుమారు 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్‌లో గుర్తుతో కూడిన స్లిప్ కన్పిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ కట్ అయి వీవీ ప్యాట్ చాంబర్‌లో పడిపోతుంది. దీని వల్ల తాము వేసిన వారికే ఓటు పడిందో లేదో నిర్థారించుకునే అవకాశం ఏర్పడింది. వీవీ ప్యాట్‌లలో పడిన స్లిప్పులను ఈవీఎంలతోపాటు పూర్తి స్థాయిలో లెక్కించాలని కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలా లెక్కిస్తే ఇక ఈవీఎంలు ఎందుకు.. పాత కాలంనాటి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. చివరికి ర్యాండమైజేషన్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీ ప్యాట్‌లను ఎంపిక చేసి.. వాటిలోని స్లిప్‌లను లెక్కించి.. వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చిన తర్వాత ఫలితాలు వెల్లడించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్లు కీలకంగా మారాయి.
తేడా వస్తే డెయిరీల పరిశీలన
రెండు మూడుసార్లు లెక్కించిన ఈవీఎం, వీవీప్యాట్ ఓట్ల సంఖ్య సరిపోలకపోతే.. అప్పుడు ఆర్వో డెయిరీ, పోలింగ్ ఆఫీసర్ డెయిరీలు పరిశీలిస్తారు. పోలింగ్ రోజున కౌంటింగ్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయేమో చెక్ చేస్తారు. అప్పటికి ఓట్లలోవ్యత్యాసం ఉంటే వీవీ ప్యాట్‌లలో ఓట్ల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక్కో వీవీ ప్యాట్‌లో స్లిప్‌ల లెక్కింపునకు కనీసం గంట సమయం పడుతుందని అంచనా. మొత్తం ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తారు. చివరగా ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లన్నీ క్రోడీకరించి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. దీనివల్ల ఫలితాల అధికారిక ప్రకటన కొంత ఆలస్యమవుతుంది.
స్లిప్‌లు ఎలా లెక్కిస్తారంటే..
♦ మొదట యథాతథంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఆ వెంటనే వీవీప్యాట్‌ల స్లిప్‌ల లెక్కింపునకు శ్రీకారం చుడతారు. ర్యాండమైజ్‌గా.. అంటే డ్రా పద్ధతిలో ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లు ఎంపిక చేస్తారు.
♦ వీటి లెక్కింపునకు ప్రత్యేకంగా వీవీ ప్యాట్ కౌంటింగ్ బూత్(వీసీబీ) ఏర్పాటు చేస్తారు. బ్యాంక్ క్యాషియర్ క్యాబిన్ మాదిరిగా ఈ బూత్‌లుంటాయి. –పూర్తిగా మెష్‌తో క్యూబికల్‌గా తయారు చేస్తారు. దాంట్లో ట్రాన్స్‌పరంట్ కంటైనర్ పెడతారు.
♦ తొలుత రిటర్నింగ్ అధికారి పోస్టల్ కార్డు సైజు పేపర్‌పై అసెంబ్లీ సిగ్మెంట్ పేరు, నెంబర్, డేట్. పోలింగ్ స్టేషన్ల పేర్లు నమోదు చేసి వాటిని నాలుగు మడతలుగా మడిచి ఆ ట్రాన్సపరంట్ కంటైనర్‌లో వేస్తారు.
♦ బాగా షేక్ చేసి తర్వాత లక్కీ డ్రా ద్వారా ఐదు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేస్తారు.
♦ అలా ఎంపిక చేసిన పోలింగ్‌స్టేషన్లకు సంబంధించి క్యారింగ్ కేస్‌లో ఉన్న వీవీ ప్యాట్లను వీసీబీలోకి తీసుకొస్తారు.
♦ ఆ సమయంలోనే అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. తొలుత వీవీ ప్యాట్‌లున్న క్యారింగ్ కేస్‌లకు సీల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే వీవీ ప్యాట్‌లకున్న కంట్రోల్ కేస్‌లకు కూడా సీల్స్ ఉన్నాయో లేదో పరిశీలించాలి. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈ సీల్స్‌ను తొలగిస్తారు.
♦ సీల్ తీసిన తర్వాత ప్యాట్‌లోని ఒక్కో స్లిప్ తీసి గుర్తుల వారీగా ట్రాన్సపరెంట్ కంపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన చాంబర్స్‌లో వేస్తారు.
♦ అలా వర్గీకరణ పూర్తి అయిన తర్వాత చాంబర్లలోని స్లిప్పులను 25 చొప్పున కట్టలు కట్టి ఆ కంపార్టుమెంట్‌లో పెట్టి లెక్కపెడతారు.
♦ ఈవీఎంలోని ఓట్లను వీవీ ప్యాట్‌లో స్లిప్‌లను సరిపోల్చి చూస్తారు.
♦ ఎక్కడైనా ఒకటి రెండు అతుక్కోవడం, కింద పడిపోవడం, గమనించకపోవడం వంటి వాటి వల్ల రెండు సంఖ్యలు సరిపోకపోతే.. మళ్లీ లెక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment