మాఫీ0.. వడ్డీ భారీ | Waiver0 .. Huge interest | Sakshi
Sakshi News home page

మాఫీ0.. వడ్డీ భారీ

Published Mon, Jun 1 2015 3:31 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

మాఫీ0.. వడ్డీ భారీ - Sakshi

మాఫీ0.. వడ్డీ భారీ

* బాబును నమ్మి ఘోరంగా మోసపోయిన డ్వాక్రా మహిళలు
* ప్రభుత్వం వడ్డీ జమ చేస్తేనే రుణాలిస్తామంటున్న బ్యాంకులు
సాక్షి నెట్‌వర్క్: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మినందుకు ఇప్పుడు తమ ఇల్లూ, వాకిలీ గుల్లయిందని డ్వాక్రా సంఘాల మహిళలు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు మాట నమ్మినందుకు అసలు రుణం మాఫీ కాకపోగా... అంతకుముందు అందే జీరో వడ్డీ స్థానంలో రెండు రూపాయల వడ్డీ భారం మోయాల్సి వస్తోందని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు.

తొలి దశ పెట్టుబడిగా అప్పు పేరుతో మహిళా సంఘాల్లో ఒక్కో మహిళకు మూడు వేల రూపాయలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట నమ్మి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారనే ఆశతో నెల నెలా అసలు వడ్డీ కట్టడం మానేశామని, అయితే ఆరు నెలల తరువాత బాబు మాఫీ చేయడం లేదని తెలిసి నెల నెలా వాయిదాలు కట్టడం ప్రారంభిస్తే సకాలంలో కట్టలేదంటూ బ్యాంకులు వడ్డీమీద వడ్డీ వేస్తూ కాంపౌండ్ ఇంపాక్ట్ పేరుతో మొత్తం రూ.రెండు  వడ్డీ (24 శాతం) వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మహిళా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ.మూడు వేల  చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2,660 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మహిళా సంఘాలు బాబు మాటలు నమ్మి సకాలంలో రుణాలు చెల్లించనందున రూ.రెండు వంతున వడ్డీ చెల్లిం చేందుకు ఏకంగా రూ.3,058 కోట్లు అవుతోంది. డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళ రూ. 50 వేల నుంచి రూ.80 వేల వరకు రుణాలు తీసుకున్నారు. ఉదాహరణకు ఒక మహిళ రూ.50 వేల రుణం తీసుకుంటే... బాబు మాట నమ్మి సకాలంలో రుణం చెల్లించనందున రూ.రెండు వడ్డీ కింద రూ.12,000 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో మహిళకు అప్పు కింద ఇస్తున్నది కేవలం రూ.3,000 మాత్రమే. అంటే చంద్రబాబు సర్కారు ఒక్కో మహిళ వడ్డీ కింద చెల్లించాల్సిన మొత్తంలో నాలుగో వంతే.. అది కూడా అప్పుగా మాత్రమే ఇస్తోంది. చంద్రబాబు  చేస్తున్న ఈ మోసంపై  మహిళలు భగ్గుమంటున్నారు.

బ్యాంకర్లు ఏమంటున్నారంటే...
ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు రూ.3 వేల వంతున పొదుపు ఖాతాలో వేస్తోంది.  సంఘం పనితీరును ఆధారంగా మేము రుణం మంజూరు చేస్తాం. సక్రమంగా కంతులు కట్టకుండా ఉండి మాకు అప్పు ఉండే సంఘాలకు రుణాలు ఇవ్వలేం. ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేస్తామని చెబుతోంది. వడ్డీ జమచేశాక సంఘం పనితీరు ఆధారంగా మాకు నమ్మకం కలిగితేనే ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణాలు ఇస్తాం.

బాబు మోసగాడని బాగా అర్థమైంది
బాబు డ్వాక్రా అప్పులపై తడవకో మాట మాట్లాడాడు. అయినా సరే కడతాడనే నమ్మకంతో ఆర్నెల్లు రూపాయి చెల్లించలేదు. ఇంతలో బ్యాంకు నుంచి లెటర్లు వచ్చాయి.  నాలుగు నెలలుగా కడుతున్నాం. ఇంకా రూ.లక్షా20వేల పైన కట్టాలి. ఇప్పుడేదో.. నోరు తిరగడం లేదు (కేపిటల్ ఇన్‌ఫ్యూజన్) దాని కింద కేవలం రూ.3వేలు మా ఖాతాల్లో జమ అవుతుందని చెబుతున్నారు. ఒకటి మాత్రం అర్థమైంది... బాబు మోసగాడని.. ఎప్పటికీ మారడని.
 - షేక్ మహబూబ్‌బి, ఇస్లాం కవాతిన్ డ్వాక్రా గ్రూపు మహిళ, బీడీ కాలనీ, ఏలూరు, ప.గో.జిల్లా
 
పక్షవాతంతో మంచానపడ్డా రుణ వేధింపులే
విశాఖపట్నం ఇందిరా నగర్‌లో నివసించే పందిరిపల్లి ధనలక్ష్మి నిరుపేద. భర్త చనిపోవడంతో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. ఆమె ఇందిరా డ్వాక్రా సంఘంలో సభ్యురాలు. ఆ సంఘలోని 11మంది సభ్యులు కలిసి రూ.55వేలు రుణం తీసుకున్నారు. రూ.27వేలు అప్పు తీర్చారు. అంతలో చంద్రబాబు సీఎం కావడంతో తమ రుణం మొత్తం మాఫీ అవుతుందనే ఆశతో వాయిదాలు చెల్లించడం నిలిపివేశారు.

ఏడాది అవుతున్నా రుణమాఫీ కాకపోవడంతో వడ్డీతో కలుపుకుని రుణం మొత్తం రూ.33వేలకు చేరుకుంది. కుటుంబపరిస్థితి బాగోక, ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక ధనలక్ష్మి  పక్షవాతానికి గురయి మంచానపడ్డారు. బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చి ఒత్తిడి తేవడంతో చివరికి ఆ సంఘం పొదుపు మొత్తంలోంచి రూ.28వేలు డ్రా చేసేశారు. పూర్తిగా రుణం చెల్లించేవరకు కొత్త రుణాలు ఇవ్వమని తేల్చిచెప్పారు. దీంతో ధనలక్ష్మి నిస్సహాయస్థితిలో పడిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement