interest burden
-
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పష్టం చేశారు. ఎక్సైజ్ సుంకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందని ఆమె సూచనప్రాయంగా పేర్కొంటూ, ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్సైజ్ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని అన్నారు. ఇంధనం కొనుగోళ్లు–వ్యయాల మధ్య ఉన్న వ్యత్యా సాన్ని తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలకు యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లకు సంబంధించి గత ఏడేళ్లలో ప్రభుత్వంపై రూ. 70,196 కోట్లకుపైగా వడ్డీ భారం పడిందని, ఇంకా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆయిల్ బాండ్ల భారాన్ని భరిం చాల్సిన స్థితి లేకపోయినట్లయితే, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితిలో ఉండేవాళ్లం’’ అని ఆమె ఈ సందర్భంగా వివరించారు. రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల విలువలో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే ఇప్పటివరకూ చెల్లించడం జరిగిందన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఇంకా రూ.1.3 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. పెట్రోల్‌పై ప్రస్తు తం లీటర్‌కు రూ.32.90 ఎక్సైజ్ సుంకం భారం పడుతుండగా, డీజిల్‌పై ఇది రూ.31.80గా ఉంది. పెట్రోలియం ప్రొడక్టులు... పెట్రోలియం ప్రొడక్టులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోనికి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. జీఎస్టీకి రాష్ట్రాలు అంగీకరిస్తే, ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్ ఒకే పన్నుగా మారతాయి. ద్వంద్వ పన్నుల విధానానికి (ఎక్సైజ్ సుంకంపై వ్యాట్ విధింపు) ఇది ముగింపు పలుకుతుంది. రెట్రో ట్యాక్స్‌పై త్వరలో నిబంధనలు రెట్రో పన్ను రద్దు నేపథ్యంలో పరిస్థితుల నిర్వహణకు త్వరలో నియమ నిబంధనలు తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. రెట్రో పన్న రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. రెట్రో ట్యాక్స్ కేసుల ఉపసంహరణ, రిఫండ్, వివాద పరిష్కారంపై తన శాఖ అధికారులు కెయిర్న్, వొడాఫోన్లతో చర్చిస్తున్నట్లు కూడా ఆర్థికమంత్రి తెలిపారు. రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధా నాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను ఈ నెలారంభంలో రద్దు చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత 2–6 శ్రేణిలో అదుపులోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికమంత్రి వ్యక్తం చేశారు. ఆదాయాలు పెరుగుతాయ్: రానున్న నెలల్లో ప్రభుత్వ ఆదాయాలు భారీగా పెరుగుతాయన్న భరోసాను ఆర్థికమంత్రి ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నులు గత కొన్ని నెలలుగా పెరిగాయని అన్నారు. ఐటీ పోర్టల్ సమస్యలు త్వరలో పరిష్కారం ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్‌ల దాఖలు విషయంలో ఈ ఫైలింగ్ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు కొద్ది వారాల్లో పరిష్కారం అవుతాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంలో తాను పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌తో నిరంతరం చర్చిస్తున్నట్లు వివరించారు. ఇన్ఫోసిస్ హెడ్ నందన్ నీలేకని కూడా ఈ మేరకు హామీ ఇస్తూ తనకు నిరంతరం సందేశాలను పంపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను 2 ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధికి సంబంధించి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. 2019 జనవరి నుంచి జూన్ 2021 మధ్య ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వొడాఫోన్‌పై ‘చర్చలు’ వొడాఫోన్ ఐడియా కుప్పకూలకుండా ప్రభుత్వం ఒక మార్గాన్ని అన్వేషిస్తుందన్న వార్తల నేపథ్యంలో సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా మంది అధికారులు ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు’’అని చెప్పారు. అయితే ఏ విషయం తన వద్దకు రాలేదని ఆమె స్పష్టం చేశారు. చర్చలు జరుపుతున్నది ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లభించకపోతే వొడాఫోన్ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అప్పుల తిప్పలు
సాక్షి, బీబీపేట(నిజామాబాద్): పేదలకు కరోనా మిగిల్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఆరు నెలలుగా అనుభవించిన గడ్డు పరిస్థితుల నుంచి బయట పడడానికి వారికి కొన్నేళ్ల కాలం పడుతుంది. పనుల్లేక పూట గడవక విధిలేని పరిస్థితుల్లో అప్పుల బాట పట్టిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో వడ్డీ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. పేదల అవసరం వడ్డీ వ్యాపారులకు అవకాశంగా మారింది. గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు తీసుకుంటున్న మొత్తాన్ని బట్టి రూ. 10కి పైనే వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు తిరిగి చెల్లిస్తున్న మొత్తం వడ్డీకి కూడా సరిపోకపోవడం బాధాకరం. ఈ జాబితాలో ఎక్కువగా రోజు వారీ కూలీలు చిరువ్యాపారులు ఉన్నారు. పనిచేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి.. కరోనా చిరు వ్యాపారులు, కూలీలు, చిన్నచిన్న ఉద్యోగుల బతుకులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ మొదలైన తర్వాత రెండు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు కదల్లేని పరిస్థితి. అప్పటి వరకు దాచిపెట్టుకున్న డబ్బులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన రేషన్ వీరి కడుపును పూర్తిగా నింపలేకపోయాయి. ఇక రెండు నెలల తర్వాత దశలవారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నప్పటికీ అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతో కూలీలకు పనులు దొరకడం కష్టంగా మారింది. గ్రామాల్లో కొంత వరకు ఉపాధి హామీ పనులు ఆదుకుంటున్నా, పట్టణాల్లోని నిరుపేదల బతుకులు మరీ దారుణంగా మారాయి. ఇక వీధి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వస్తువులు, తిను బండారాలను కొనేవారు లేకుండా పోయారు. దీంతో రోజూ వీధులు తిరుగుతూ రోడ్లపై బండ్లు, బుట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న పేద వర్గాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇక విధి లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చుకొని బతుకు బండి లాగించాల్సిన దుస్థితి నెలకొంది. అవసరాన్ని ఆసరాగా తీసుకొని.. ఓ వైపు నిరుపేదల దుస్థితి ఇలా ఉంటే వడ్డీ మాఫియా మా త్రం దీన్ని అవకాశంగా మలుచుకుంటోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 2కు మించి వడ్డీకి ఇవ్వకూడదు. కానీ సాధారణ రోజుల్లోనూ రూ. 5 వరకు వడ్డీ వసూలు చేసేవా రు. అయితే ఇప్పుడు కష్టకాలంలో తగ్గించాల్సింది పోయి రె ట్టింపు చేశారు. వడ్డీ మాఫియా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడంతో పేదలపై కరోనా భారం కన్నా వడ్డీ భారం ఎక్కువగా కనిపిస్తోంది. కూలీలు, వీధి వ్యాపారులు రూ. 10 వేలు నుంచి రూ. 50 వేల వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. రోజువారీ, వారం వారీ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంది. వీ ధి వ్యాపారులు పెట్టుబడి కోసం ఉదయం తీసుకుంటే సా యంత్రానికి తిరిగి చెల్లించాలి. ఇప్పుడు రోజంతా వ్యాపారం చేసినా తిరిగి చెల్లించడానికి మొత్తం సరిపోతుంది తప్ప ఏమీ మిగలడం లేదని పలువురు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి నుంచి ప్రామిసరీ నోట్లు, వస్తువులు, వాహనాలు, ఇళ్లపట్టాలు తీసుకుంటూ వడ్డీకి డబ్బులిస్తున్నారు. పనులు దొరక్క ఒకటి రెండు రోజులు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే నిరుపేదల జీవితాలు మరింత దారుణంగా మారనుంది. భారంగా దుకాణాల కిరాయిలు జిల్లా వ్యాప్తంగా ఆయా దుకాణాలు నడిపే వ్యక్తులు చాలా వరకు కిరాయికి తీసుకున్న షాపులే. జిల్లా కేంద్రంలో ఒక్కో షాపు కిరాయి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు కూడా ఉంది. మండల కేంద్రంలో రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. దీంతో ఆరు నెలలుగా దుకాణాలు సరిగ్గా నడవకపోవడంతో రూం అద్దెలు చెల్లించడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. అటు అద్దె చెల్లించకపోవడంతో సదరు యజమానులు రూంలు ఖాళీ చేయించడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా వరకు షాపులు మూతబడ్డాయి. ఒక్కో షాపు యజమాని వడ్డీకి డబ్బులు తెచ్చి రూం అద్దెలు చెల్లిస్తున్నారు. కరోనా వల్ల చాలా నష్టాలు చూస్తున్నాం కరోనా వైరస్ వల్ల దుకాణాలు నడవక పోవడంతో కుటుంబం నడవడమే ఇబ్బందిగా ఉంది. గతంలో వచ్చిన గిరాకీ ఇప్పుడు లేకపోవడంతో తెచ్చిన సరుకులు సైతం వాలిడిటీ అయిపోయి పాడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొనడానికి వచ్చే ప్రజలు కూడా భయంతో వణుకుతున్నారు. దుకాణాలు విడిచి వేరే పని చేసుకోవాలంటే ఇంత సరుకులు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే చిన్న వ్యాపారులను ఆదుకోవాలి. – వెంకటేశ్, జనరల్ స్టోర్ నిర్వాహకుడు, బీబీపేట దుకాణాలు నడపడం భారంగా ఉంది కరోనా వల్ల దుకాణాలు నడవకపోవడంతో వాటి అద్దెలు కూడా చెల్లించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెచ్చిన సరుకులు అమ్ముడు పోతలేవు. దీంతో దుకాణాలు నడపడం భారంగా మారింది. అంతే కాకుండా గ్రామాల్లో సైతం లాక్డౌన్ విధించడంతో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం లాక్డౌన్ లేకుంటే అయిన కొద్దిగా గిరాకీ వస్తుండేది. కానీ లాక్డౌన్ పెట్టడంతో జనాలు బయటకు రావడం లేదు. దీంతో దుకాణాలు నడవడం కష్టంగా మారింది. – మహేశ్, మొబైల్ షాపు నిర్వాహకుడు, బీబీపేట అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలు తెలపాలి పేదల నుంచి వడ్డీ వ్యాపారులు అప్పులకు సంబంధించి అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలు తెలపాలని, వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోం. ఇచ్చిన అప్పులను వసూలు చేసే క్రమంలో ఇళ్లపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రజలు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – యాలాద్రి, సీఐ, భిక్కనూరు -
రైతులపై వడ్డీ భారం నిజమేనా?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పొందిన రైతులపై బ్యాంకులు వడ్డీ భారం మోపుతున్నాయంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిస్తోంది. వడ్డీ భారం పడ్డ 24,342 మంది రైతుల దరఖాస్తులను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. వాటిని ప్రభుత్వం వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్కు పంపింది. ఆయా దరఖాస్తులను వ్యవసాయ శాఖ జిల్లాల వారీగా పంపించింది. ఉత్తమ్ పంపిన రైతు దరఖాస్తులపై క్షుణ్నంగా అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక పంపాలని జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. జిల్లా వ్యవసాయాధికారులు ఆయా దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. వ్యవసాయాధికారులతో కలసి సంబంధిత బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఉత్తమ్ పంపిన ఫిర్యా దుల్లోని రైతులపై నిజంగానే వడ్డీ భారం పడిందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అనేక మంది రైతులపై వడ్డీ భారం పడినట్లు తెలుస్తోందని ఆ శాఖ వర్గాల సమాచారం. బ్యాంకులకు సర్కారు బకాయి రూ.409 కోట్లు.. రైతులకు ఇచ్చిన రుణాలకు సంబంధించి పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.409 కోట్లు బకాయి పడింది. వాటిని తీర్చడంలో సర్కారు వైఫల్యం కారణంగా అది రైతుకు శాపంగా మారిందని పేర్కొంటున్నారు. రూ.321 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) జారీ చేసి డబ్బుల విడుదలలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీంతో ఆ సొమ్మును రైతుల నుంచే బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తం విడుదల చేస్తామని చాలా సార్లు ప్రభుత్వం బ్యాంకులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాన్ని 4 విడతలుగా మాఫీ చేయడంతో రైతులపై విపరీతమైన వడ్డీ భారం పడింది. బ్యాంకులో ఉన్న పట్టా పాసు పుస్తకాలను విడిపించుకునేందుకు వడ్డీని రైతులే భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రాకపోవడంతో అనేక చోట్ల బలవంతంగా వడ్డీలు వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, రుణాలు ఇవ్వకుండా వేధించడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. -
పట్టణ ప్రజలపై వడ్డీ భారం
కట్టకపోతే తాళం వేస్తున్న మున్సిపల్ సిబ్బంది ♦ జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల బాదుడు ♦ ఒంగోలు కార్పొరేషన్లోనే రూ.17 కోట్లు ♦ మినహాయింపు ఊసెత్తని ప్రభుత్వం ♦ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, అర్బన్: పట్టణ ప్రజలపై వడ్డీ భారం పెరిగిపోతోంది. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించలేదన్న పేరుతో అపరాధ రుసుం పేరుతో నూటికి నెలకు రెండు రూపాయల వడ్డీని వేస్తున్నారు. దీంతో ఆస్తిపన్ను బకాయిలు పెరిగిపోతున్నాయి. దీనిపై పలువురు కోర్టులను ఆశ్రయించగా మిగిలిన వారు ప్రభుత్వం మినహాయింపు ఇస్తే కడతామని కరాఖండిగా చెబుతున్నారు. జిల్లాలో సుమారు 20 కోట్లు రూపాయలపైనే వడ్డీ రూపంలో భారం పడుతున్నట్లు సమాచారం. ఇందులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోనే వడ్డీ భారం రూ. 17 కోట్లు ఉంది. ఇది తలకుమించిన భారంగా మారుతోందని టాక్స్‌పేయర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్నులు కూడా అడ్డదిడ్డంగా ఒక శాస్త్రీయ పద్దతి లేకుండా వేయడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసి చెల్లించకుండా ఆపారు. కనీస వసతులు పట్టించుకోకుండా పన్ను చెల్లించని తేదీ నుంచి నెలకు వందకు రెండు రూపాయల వడ్డీ చొప్పున వేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల అసలుకన్నా వడ్డీ ఎక్కువయ్యే పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది పన్నులు వసూలు చేయడంలో నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం వహించి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వని సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఒంగోలులో నగరపాలక సిబ్బంది బృందాలుగా ఏర్పడి పన్నులు చెల్లించని వారి ఆస్తులకి తాళాలు వేస్తున్నారు. పన్నులపై వడ్డీ రాయితీ ఇస్తే పన్నులు కడతామని నగరవాసులు అంటున్నా ఉన్నతాధికారులు మాత్రం అటువంటి అవకాశం లేదని స్పష్టం చేయడంతో అయోమయ పరిస్థితులు నెలకున్నారుు. ♦ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ అస్తులకి సంబంధించిన పన్నులు రూ.6 కోట్లు పైబడి ఉన్నాయి. ప్రజలకి సంబంధించి రూ.21 కోట్లున్నాయి. మొత్తం రూ.27 కోట్లు పన్నుల రూపంలో ఉంటే మరో రూ.17 కోట్లు వడ్డీ రూపంలో ప్రజలపై భారంగా భయపెడుతోంది. ♦ మార్కాపురంలో మొత్తం అసెస్మెంట్లు 13,744 ఉండ గా డిమాండ్ రూ.3.61 కోట్లుంది. ఇప్పటికి రెండున్నర కోట్ల రూపాయల వరకూ వసూలు కాగా కోటీ 15 లక్షలు వసూలు కావల్సి ఉంది. సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో ఉన్నట్లు అంచనా. ♦ గిద్దలూరు నగరపంచాయతీలో బకాయిలు కోటీ 23 లక్షలుండగా 67 లక్షలు వసూళ్లయ్యాయి. సుమారు నాలుగు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో నగర ప్రజలు చెల్లించాల్సి ఉంది. ♦ అద్దంకి మున్సిపాలిటీలో కోటీ 72 లక్షల రూపాయలు ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా, 67.5 లక్షలు వసూలైంది. మూడు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ♦ కందుకూరు మున్సిపాలిటీలో ఐదు కోట్ల 30 లక్షల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 2.15 కోట్లు వసూలు చేశారు. వడ్డీ రూపాయలో చెల్లించాల్సింది2.46 కోట్లు. మిగిలిన మున్సిపాలిటీలలో కూడా వడ్డీలు భారీగానే ఉన్నాయి. ♦ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ రాయితీ ఇస్తే ప్రజలకు మేలు జరగడంతోపాటు మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను త్వరగా వసూలయ్యే అవకాశం ఉంది. -
మాఫీ0.. వడ్డీ భారీ
* బాబును నమ్మి ఘోరంగా మోసపోయిన డ్వాక్రా మహిళలు * ప్రభుత్వం వడ్డీ జమ చేస్తేనే రుణాలిస్తామంటున్న బ్యాంకులు సాక్షి నెట్వర్క్: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మినందుకు ఇప్పుడు తమ ఇల్లూ, వాకిలీ గుల్లయిందని డ్వాక్రా సంఘాల మహిళలు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు మాట నమ్మినందుకు అసలు రుణం మాఫీ కాకపోగా... అంతకుముందు అందే జీరో వడ్డీ స్థానంలో రెండు రూపాయల వడ్డీ భారం మోయాల్సి వస్తోందని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. తొలి దశ పెట్టుబడిగా అప్పు పేరుతో మహిళా సంఘాల్లో ఒక్కో మహిళకు మూడు వేల రూపాయలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట నమ్మి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారనే ఆశతో నెల నెలా అసలు వడ్డీ కట్టడం మానేశామని, అయితే ఆరు నెలల తరువాత బాబు మాఫీ చేయడం లేదని తెలిసి నెల నెలా వాయిదాలు కట్టడం ప్రారంభిస్తే సకాలంలో కట్టలేదంటూ బ్యాంకులు వడ్డీమీద వడ్డీ వేస్తూ కాంపౌండ్ ఇంపాక్ట్ పేరుతో మొత్తం రూ.రెండు వడ్డీ (24 శాతం) వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మహిళా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ.మూడు వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2,660 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మహిళా సంఘాలు బాబు మాటలు నమ్మి సకాలంలో రుణాలు చెల్లించనందున రూ.రెండు వంతున వడ్డీ చెల్లిం చేందుకు ఏకంగా రూ.3,058 కోట్లు అవుతోంది. డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళ రూ. 50 వేల నుంచి రూ.80 వేల వరకు రుణాలు తీసుకున్నారు. ఉదాహరణకు ఒక మహిళ రూ.50 వేల రుణం తీసుకుంటే... బాబు మాట నమ్మి సకాలంలో రుణం చెల్లించనందున రూ.రెండు వడ్డీ కింద రూ.12,000 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో మహిళకు అప్పు కింద ఇస్తున్నది కేవలం రూ.3,000 మాత్రమే. అంటే చంద్రబాబు సర్కారు ఒక్కో మహిళ వడ్డీ కింద చెల్లించాల్సిన మొత్తంలో నాలుగో వంతే.. అది కూడా అప్పుగా మాత్రమే ఇస్తోంది. చంద్రబాబు చేస్తున్న ఈ మోసంపై మహిళలు భగ్గుమంటున్నారు. బ్యాంకర్లు ఏమంటున్నారంటే... ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు రూ.3 వేల వంతున పొదుపు ఖాతాలో వేస్తోంది. సంఘం పనితీరును ఆధారంగా మేము రుణం మంజూరు చేస్తాం. సక్రమంగా కంతులు కట్టకుండా ఉండి మాకు అప్పు ఉండే సంఘాలకు రుణాలు ఇవ్వలేం. ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తామని చెబుతోంది. వడ్డీ జమచేశాక సంఘం పనితీరు ఆధారంగా మాకు నమ్మకం కలిగితేనే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణాలు ఇస్తాం. బాబు మోసగాడని బాగా అర్థమైంది బాబు డ్వాక్రా అప్పులపై తడవకో మాట మాట్లాడాడు. అయినా సరే కడతాడనే నమ్మకంతో ఆర్నెల్లు రూపాయి చెల్లించలేదు. ఇంతలో బ్యాంకు నుంచి లెటర్లు వచ్చాయి. నాలుగు నెలలుగా కడుతున్నాం. ఇంకా రూ.లక్షా20వేల పైన కట్టాలి. ఇప్పుడేదో.. నోరు తిరగడం లేదు (కేపిటల్ ఇన్ఫ్యూజన్) దాని కింద కేవలం రూ.3వేలు మా ఖాతాల్లో జమ అవుతుందని చెబుతున్నారు. ఒకటి మాత్రం అర్థమైంది... బాబు మోసగాడని.. ఎప్పటికీ మారడని. - షేక్ మహబూబ్బి, ఇస్లాం కవాతిన్ డ్వాక్రా గ్రూపు మహిళ, బీడీ కాలనీ, ఏలూరు, ప.గో.జిల్లా పక్షవాతంతో మంచానపడ్డా రుణ వేధింపులే విశాఖపట్నం ఇందిరా నగర్లో నివసించే పందిరిపల్లి ధనలక్ష్మి నిరుపేద. భర్త చనిపోవడంతో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. ఆమె ఇందిరా డ్వాక్రా సంఘంలో సభ్యురాలు. ఆ సంఘలోని 11మంది సభ్యులు కలిసి రూ.55వేలు రుణం తీసుకున్నారు. రూ.27వేలు అప్పు తీర్చారు. అంతలో చంద్రబాబు సీఎం కావడంతో తమ రుణం మొత్తం మాఫీ అవుతుందనే ఆశతో వాయిదాలు చెల్లించడం నిలిపివేశారు. ఏడాది అవుతున్నా రుణమాఫీ కాకపోవడంతో వడ్డీతో కలుపుకుని రుణం మొత్తం రూ.33వేలకు చేరుకుంది. కుటుంబపరిస్థితి బాగోక, ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక ధనలక్ష్మి పక్షవాతానికి గురయి మంచానపడ్డారు. బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చి ఒత్తిడి తేవడంతో చివరికి ఆ సంఘం పొదుపు మొత్తంలోంచి రూ.28వేలు డ్రా చేసేశారు. పూర్తిగా రుణం చెల్లించేవరకు కొత్త రుణాలు ఇవ్వమని తేల్చిచెప్పారు. దీంతో ధనలక్ష్మి నిస్సహాయస్థితిలో పడిపోయారు. -
‘మహిళ’లకు మొండి చేయి!
- బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారం - అమలు కాని వడ్డీ లేని రుణాల పథకం - జిల్లాలోని మహిళా సంఘాలకు - బకాయి రూ. 46.40 కోట్లు మోర్తాడ్ : మహిళా సంఘాలకు అండగా ఉంటామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. వడ్డీ లేని రుణం పథకం ఎక్కడా కానరావడం లేదు. దీంతో మహిళలు తాము తీసుకున్న బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని మోయూల్సివస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి ప్రతి నెలా కిస్తులు సక్రమంగా చెల్లించే మహిళా సంఘాలకు.. వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీరుుంబర్స్‌మెంట్ రూపంలో ఖాతాల్లో జమ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2014లో ఏర్పాటు అయినా ఏప్రిల్ 2014 నుంచి ఉన్న వడ్డీ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా గతంలో ప్రకటించారు. గత డిసెంబర్ నాటికి జిల్లాలోని మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 46.40 కోట్లు వడ్డీ సొమ్ము జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నయాపైసా వడ్డీని వాపసు చేయలేక పోయింది. దీంతో మహిళలు తమ బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని యధాతథంగా మోస్తున్నారు. జిల్లాలో 39,473 మహిళా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 4,24,574 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల కిస్తులను సక్రమంగా చెల్లించి వడ్డీ మాఫీ కోసం అర్హత పొందిన సంఘాలు జిల్లాలో 33,742 ఉన్నాయి. మహిళా సంఘాలు వడ్డీ మాఫీకి అర్హతను సంపాదించుకోవడం కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా రుణాల కిస్తులను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించారుు. వడ్డీ మాఫీకి అర్హత పొందిన సంఘాల వివరాలను ఇందిర క్రాంతి పథం అధికారులు ఎప్పటికప్పుడు సెర్ప్ ఉన్నతాధికారులకు చేరవేశారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాల్సి ఉంది. 2014 ఏప్రిల్ నుంచి వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద లెక్కలు సిద్ధంగా ఉన్నా నిధులు కేటాయించడంలో తాత్సారం జరుగుతోంది. బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన మహిళా సంఘాల సభ్యులు ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారే. తమ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం బ్యాంకు లింకేజీ రుణాలను పొందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ మాఫీకి సంబంధించిన రీరుుంబర్స్‌మెంట్‌ను చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. -
రుణాలు రీ షెడ్యూలైనా 600 కోట్ల వడ్డీ భారం
రుణాల రీ షెడ్యూల్‌పైనే ప్రభుత్వం ఆశ ఆ దిశగా కసరత్తు.... మూడు నుంచి ఐదేళ్లకు మించని రీ షెడ్యూల్.. సాక్షి, హైదరాబాద్: రైతు రుణ మాఫీని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తిరస్కరించడంతో.. కనీసం కరువు మండలాల్లోని రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ రుణాల రీ షెడ్యూల్‌కు అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం సమర్పించే రీ షెడ్యూల్ నివేదికను పరిశీలించాక కాని ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. మూడు నుంచి ఐదేళ్లకు మించి రీ షెడ్యూల్ చేసేందుకు అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రీ షెడ్యూల్ అంటే రైతులు తిరిగి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటూ.. బకాయిలు చెల్లించడానికి హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బకాయిలను రైతులు చెల్లించినా.. ప్రభుత్వం నేరుగా చెల్లించినా ప్రతియేటా అదనంగా దాదాపు రూ.600 కోట్ల మేరకు వడ్డీ భారం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రకృతి విపత్తుల కింద రుణాలు రీ షెడ్యూల్ చేసే పక్షంలో.. ఒక సంవత్సరం అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం మాత్రమే ఉంటుందని, లేని పక్షంలో మొదటి ఏడాది నుంచే వడ్డీభారం తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణాల రీ షెడ్యూల్ కూడా గతంలో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలకు మాత్రమే వర్తిస్తుందని, మొత్తం మండలాలకు వర్తించదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. కరువు మండలాల జాబితాలో లేని రైతులు విధిగా రుణాలు చెల్లిస్తే తప్ప వారికి కొత్త రుణాలు లభించే అవకాశం లేదు. కరువు మండలాల్లో రుణాల రీ షెడ్యూల్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి సమర్పించాక.. దానిని పరిశీలించిన తరువాత కాని తన నిర్ణయం ఏమిటో వెల్లడించే అవకాశం లేదని ఆ అధికారి వివరించారు. తాము మాత్రం రీ షెడ్యూల్ జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణలో కరువు మండలాలు దాదాపు 370 వరకు ఉన్నాయని, వాటిలో రుణాలు రీ షెడ్యూల్ అయినా.. రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం మాఫీ చేయాలని భావిస్తున్న 17 వేల కోట్ల రూపాయల రుణాల్లో 70 నుంచి 75 శాతం రుణాలు రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ రీ షెడ్యూల్ కూడా మూడు సంవత్సరాలకు ఆర్బీఐ పరిమితం చేస్తుందని, మరీ కోరితే ఐదేళ్ల వరకు అనుమతించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఆర్బీఐ నుంచి స్పష్టమైన సమాచారం వచ్చాకే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు.