పట్టణ ప్రజలపై వడ్డీ భారం
కట్టకపోతే తాళం వేస్తున్న మున్సిపల్ సిబ్బంది
♦ జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల బాదుడు
♦ ఒంగోలు కార్పొరేషన్లోనే రూ.17 కోట్లు
♦ మినహాయింపు ఊసెత్తని ప్రభుత్వం
♦ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, అర్బన్: పట్టణ ప్రజలపై వడ్డీ భారం పెరిగిపోతోంది. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించలేదన్న పేరుతో అపరాధ రుసుం పేరుతో నూటికి నెలకు రెండు రూపాయల వడ్డీని వేస్తున్నారు. దీంతో ఆస్తిపన్ను బకాయిలు పెరిగిపోతున్నాయి. దీనిపై పలువురు కోర్టులను ఆశ్రయించగా మిగిలిన వారు ప్రభుత్వం మినహాయింపు ఇస్తే కడతామని కరాఖండిగా చెబుతున్నారు. జిల్లాలో సుమారు 20 కోట్లు రూపాయలపైనే వడ్డీ రూపంలో భారం పడుతున్నట్లు సమాచారం.
ఇందులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోనే వడ్డీ భారం రూ. 17 కోట్లు ఉంది. ఇది తలకుమించిన భారంగా మారుతోందని టాక్స్‌పేయర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్నులు కూడా అడ్డదిడ్డంగా ఒక శాస్త్రీయ పద్దతి లేకుండా వేయడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసి చెల్లించకుండా ఆపారు. కనీస వసతులు పట్టించుకోకుండా పన్ను చెల్లించని తేదీ నుంచి నెలకు వందకు రెండు రూపాయల వడ్డీ చొప్పున వేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల అసలుకన్నా వడ్డీ ఎక్కువయ్యే పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది పన్నులు వసూలు చేయడంలో నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం వహించి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వని సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఒంగోలులో నగరపాలక సిబ్బంది బృందాలుగా ఏర్పడి పన్నులు చెల్లించని వారి ఆస్తులకి తాళాలు వేస్తున్నారు. పన్నులపై వడ్డీ రాయితీ ఇస్తే పన్నులు కడతామని నగరవాసులు అంటున్నా ఉన్నతాధికారులు మాత్రం అటువంటి అవకాశం లేదని స్పష్టం చేయడంతో అయోమయ పరిస్థితులు నెలకున్నారుు.
♦ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ అస్తులకి సంబంధించిన పన్నులు రూ.6 కోట్లు పైబడి ఉన్నాయి. ప్రజలకి సంబంధించి రూ.21 కోట్లున్నాయి. మొత్తం రూ.27 కోట్లు పన్నుల రూపంలో ఉంటే మరో రూ.17 కోట్లు వడ్డీ రూపంలో ప్రజలపై భారంగా భయపెడుతోంది.
♦ మార్కాపురంలో మొత్తం అసెస్‌మెంట్లు 13,744 ఉండ గా డిమాండ్ రూ.3.61 కోట్లుంది. ఇప్పటికి రెండున్నర కోట్ల రూపాయల వరకూ వసూలు కాగా కోటీ 15 లక్షలు వసూలు కావల్సి ఉంది. సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో ఉన్నట్లు అంచనా.
♦ గిద్దలూరు నగరపంచాయతీలో బకాయిలు కోటీ 23 లక్షలుండగా 67 లక్షలు వసూళ్లయ్యాయి. సుమారు నాలుగు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో నగర ప్రజలు చెల్లించాల్సి ఉంది.
♦ అద్దంకి మున్సిపాలిటీలో కోటీ 72 లక్షల రూపాయలు ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా, 67.5 లక్షలు వసూలైంది. మూడు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంది.
♦ కందుకూరు మున్సిపాలిటీలో ఐదు కోట్ల 30 లక్షల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 2.15 కోట్లు వసూలు చేశారు. వడ్డీ రూపాయలో చెల్లించాల్సింది2.46 కోట్లు. మిగిలిన మున్సిపాలిటీలలో కూడా వడ్డీలు భారీగానే ఉన్నాయి.
♦ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ రాయితీ ఇస్తే ప్రజలకు మేలు జరగడంతోపాటు మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను త్వరగా వసూలయ్యే అవకాశం ఉంది.