రుణాలు రీ షెడ్యూలైనా 600 కోట్ల వడ్డీ భారం
రుణాలు రీ షెడ్యూలైనా 600 కోట్ల వడ్డీ భారం
Published Mon, Jul 7 2014 1:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
రుణాల రీ షెడ్యూల్‌పైనే ప్రభుత్వం ఆశ
ఆ దిశగా కసరత్తు.... మూడు నుంచి ఐదేళ్లకు మించని రీ షెడ్యూల్..
సాక్షి, హైదరాబాద్: రైతు రుణ మాఫీని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తిరస్కరించడంతో.. కనీసం కరువు మండలాల్లోని రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ రుణాల రీ షెడ్యూల్‌కు అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం సమర్పించే రీ షెడ్యూల్ నివేదికను పరిశీలించాక కాని ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. మూడు నుంచి ఐదేళ్లకు మించి రీ షెడ్యూల్ చేసేందుకు అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రీ షెడ్యూల్ అంటే రైతులు తిరిగి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటూ.. బకాయిలు చెల్లించడానికి హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ బకాయిలను రైతులు చెల్లించినా.. ప్రభుత్వం నేరుగా చెల్లించినా ప్రతియేటా అదనంగా దాదాపు రూ.600 కోట్ల మేరకు వడ్డీ భారం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రకృతి విపత్తుల కింద రుణాలు రీ షెడ్యూల్ చేసే పక్షంలో.. ఒక సంవత్సరం అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం మాత్రమే ఉంటుందని, లేని పక్షంలో మొదటి ఏడాది నుంచే వడ్డీభారం తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణాల రీ షెడ్యూల్ కూడా గతంలో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలకు మాత్రమే వర్తిస్తుందని, మొత్తం మండలాలకు వర్తించదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. కరువు మండలాల జాబితాలో లేని రైతులు విధిగా రుణాలు చెల్లిస్తే తప్ప వారికి కొత్త రుణాలు లభించే అవకాశం లేదు. కరువు మండలాల్లో రుణాల రీ షెడ్యూల్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి సమర్పించాక.. దానిని పరిశీలించిన తరువాత కాని తన నిర్ణయం ఏమిటో వెల్లడించే అవకాశం లేదని ఆ అధికారి వివరించారు.
తాము మాత్రం రీ షెడ్యూల్ జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణలో కరువు మండలాలు దాదాపు 370 వరకు ఉన్నాయని, వాటిలో రుణాలు రీ షెడ్యూల్ అయినా.. రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం మాఫీ చేయాలని భావిస్తున్న 17 వేల కోట్ల రూపాయల రుణాల్లో 70 నుంచి 75 శాతం రుణాలు రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ రీ షెడ్యూల్ కూడా మూడు సంవత్సరాలకు ఆర్‌బీఐ పరిమితం చేస్తుందని, మరీ కోరితే ఐదేళ్ల వరకు అనుమతించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన సమాచారం వచ్చాకే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు.
Advertisement