కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని వక్ఫ్ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె.నిర్మల రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ అధికారులను ఆదేశించారు. బుధవారం తమ కార్యాలయంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వక్ఫ్‌బోర్డు స్థలాలు అధికంగా ఉన్నాయన్న సర్వే నంబర్ల ప్రకారం స్థలాల వివరాలను మండల తహశీల్దార్లకు పంపించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఖాదర్‌బాషను ఆదేశించారు. 1963లో వక్ఫ్‌బోర్డు స్థలాలను ప్రభుత్వం ప్రచురించిందని, అవి రెవెన్యూ రికార్డులలో నమోదు అయ్యాయో లేదో తహశీల్దార్లు పరిశీలించాలని చెప్పారు.
జమ్మలమడుగు మండలంలో అధికంగా ఉన్న వక్ఫ్ స్థలాల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి వివరాలు పంపాలని ఆర్డీఓ రఘునాథరెడ్డిని ఆదేశించారు. మసీదులు ఏర్పాటు చేసుకొని గదులు అద్దెకిస్తున్నారని, వస్తున్న అద్దె డబ్బులు ఎవరికి చెల్లిస్తున్నారో పరిశీలించాలని తహశీల్దార్లకు సూచనలు ఇస్తామన్నారు. వక్ఫ్ స్థలాలను అడంగల్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఓఎస్‌డి చంద్రశేఖర్‌రెడ్డి, డిఆర్‌ఓ ఈశ్వరయ్య, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఆర్డీఓ హరిత, జిల్లా పంచాయతీ అధికారి అపూర్వసుందరి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు
Published Thu, Jan 30 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement