నువ్వా....నేనా? ....రచ్చ
జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న కేంద్ర రైల్యే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైంది. వీరిద్దరి మధ్య రచ్చ ముదిరి పాకాన పడింది. నువ్వా.. నేనా? అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలిద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలతో శ్రేణుల్లో కలకలం రేగుతోంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే వీరిద్దరు రచ్చకెక్కారనే చర్చ జరుగుతోంది.
శనివారం ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా మంత్రి కోట్ల టీజీనుద్దేశించి మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌లో ఉంటూ మంత్రి పదవులు అనుభవిస్తూ పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్న వారు బయటకు వెళ్లిపోవాలని’ విమర్శించారు. ఆ తర్వాత 24 గంటలు గడవక మునుపే మంత్రి టీజీ సైతం అదే రీతిలో మంత్రి కోట్లపై ఘాటైన విమర్శలు చేశారు. ఆదివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లకు ఆహ్వానం అందకపోగా.. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు పాల్గొనడం సరికొత్త వివాదానికి దారితీస్తోంది.
పార్టీలు మారడం ఆయనకే చెల్లు
పార్టీలు మారడం మంత్రి టీజీకి కొత్తేమీ కాదని.. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు చుట్టేసి వచ్చారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీది కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎలాగూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని.. ఎంత త్వరగా బయటకు వెళితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని.. రాజకీయాల్లోనూ ఎదుగుదల సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపనలు చేయాలే కానీ.. జిల్లా కేంద్రంలో ఉండి వ్యవహారం నడిపితే ఎలాగని ప్రశ్నించారు.
ఆ పనులన్నింటికీ తాను ఆయా ప్రాంతాలకు వెళ్లి తిరిగి శంకుస్థాపన చేస్తానన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండగా.. టీజీ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. 2004లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తానే తగుటబెట్టినట్లు ఆరోపించడం సత్యదూరమన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పొరపాటును తనకు అంటగట్టడం సరికాదన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని.. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి టీజీ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్న విషయమై విలేకరులు ప్రశ్నించగా.. అది కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చూసుకుంటారని దాటవేశారు. విభజన వల్ల ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చునని, 2019లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
కార్యాలయాన్నే తగులబెట్టించావు
ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు
చేస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు.