‘జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ పచ్చసొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తూ పరువు తీస్తున్నాడు.
కోడుమూరు: ‘జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ పచ్చసొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తూ పరువు తీస్తున్నాడు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్లెజనం కోసం ఎల్లెల్సీ నీటిని కుంటలు, చెరువులకు వదలాలని ఉత్తరం రాసి నెల రోజులైనా మాట మాత్రం జవాబురాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడంలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదని బోర్డు పెట్టండి సరిపోతుంది’ అంటూ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలెక్టర్ తీరుపై విరుచుకుపడ్డారు.
పనితీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గురువారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు. ‘వర్షాలు లేక రైతాంగం ఆవస్థలు పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను టీడీపీ ప్రభుత్వం, అధికారులు కాపాడలేరు. ఈ ఐదేళ్లు ప్రజలను ఆ భగవంతుడే రక్షించాలి’ అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కె.హేమాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.