పట్టాలెక్కని కోట్ల రైలు | there is no development with kotla suryaprakash reddy | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కని కోట్ల రైలు

Published Mon, May 5 2014 1:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పట్టాలెక్కని కోట్ల రైలు - Sakshi

పట్టాలెక్కని కోట్ల రైలు

జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఒరిగింది అంతంతమాత్రమే. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులు జిల్లాకు తెప్పించడంలో విఫలం అయ్యారు.

రైల్వే సహాయ మంత్రిగా కోట్ల ఉన్నా ఒరిగింది అంతంతే
ఊరించి తుస్సుమన్న వర్క్‌షాపు ఏర్పాటు
పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల్లేవు.. కొత్తవాటి ఊసేలేదు
* మంత్రాలయం లైను మరిచిన మంత్రి

 
 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఒరిగింది అంతంతమాత్రమే. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులు జిల్లాకు తెప్పించడంలో విఫలం అయ్యారు. వర్క్‌షాపు ఏర్పాటు ఊరించి తుస్సు మంది. కర్నూలు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి 2012 అక్టోబర్ 28వ తేదీన రైల్వే శాఖ సహాయం మంత్రి ప్రమాణం చేశారు. 2013లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు  ఆయన మార్కుల పెద్దగా లేదు. ఒక ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఒక ప్యాసింజరు రైలుతోనే సరిపెట్టారు. ఏళ్లతరబడి ఉన్న డిమాండ్లకు పరిష్కారం చూపలేదు. 2014 బడ్జెట్ కూడా ప్రయాణికులు, నిరుద్యోగులకు నిరాశ పర్చింది. కొత్త ప్రాజెక్టుల అసలు ఊసే లేదు. ఆయన ఎంతో ప్రతిష్టా త్మకంగా ప్రకటించిన వర్క్‌షాపు నిర్మాణానికి మార్గం పడలేదు. దశాబ్దాల నాటి డిమాండ్ ఉన్నా మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం తొలగించలేదు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.2వేల కోట్లు కావాల్సి ఉండగా అరకొరే విదిల్చారు.

44 ఏళ్ల ప్రతిపాదనకు గ్రహణం
అధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన రైల్వేలైనుకు పట్టిన గ్రహణం వీడ లేదు. సహాయ మంత్రిగా కర్నూలు ఎంపీ ఉన్నప్పటికీ గ్రీన్‌సిగ్నల్ దొరకలేదు. 44 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈలైనుకు ఇప్పటికీ మోక్షం లభించకపోవడం గమనార్హం. 2004లో రైల్వే మంత్రి నితీష్‌కుమార్ అప్పటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించడంతో సర్వే పూర్తి చేసి నివేదికలిచ్చారు.  2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్‌లో కొత్త లైను ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు.  2011 ఫిబ్రవరి 23న సర్వే పనుల కోసం రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. గతంలో రూపొందించిన మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని సర్వే కాంట్రాక్టర్ నివేదిక అందజేశారు. తాజాగా ఇప్పుడు నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100కోట్లకు చేరుతుందని అంచనా. మంత్రి కోట్ల కనీసం చిల్లిగవ్వ కూడా మంజూరు చేయించలేకపోయారు. దీంతో రెండు సార్లు సర్వే చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయి.
 
 నీరుగారిన మరిన్ని హామీలు:

* కర్నూలులో రైల్వే వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు గత ఏడాది  బడ్జెట్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.  
* దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్ (నిర్వాహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు.
* సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణానికి, ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నిధుల్లేవు.
* హోస్పెట్ - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామని కోట్ల హామీ ఇచ్చినామోక్షం లభించలేదు.
* ఎర్రగుంట్ల - నంద్యాల లైను పెండింగ్ పనులకు, గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలో మీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు విదిల్చలేదు.
* కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు.

 జగనన్న మాట:
 రైల్వే బడ్జెట్‌లో ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందని, ఎన్నికల్లో అధికమంది ఎంపీలను గెలుచుకొని మన రాష్ట్రానికి రైల్వే మంత్రి పదవి దక్కించుకోవాలని పదేపదే ప్రకటించారు. రైల్వే మంత్రి వస్తే జగనన్న ఇచ్చిన హామీ మేరకు జిల్లాతోపాటు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తితోపాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇచ్చే ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో నడిచే ఎంపీలు, ఎమ్మెల్యేలనే గెలిపిస్తామని తేల్చి చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement