
ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం సాధారణంగా మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల మన దేశం చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాంటిది ఇస్రో కార్యాలయంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి చంద్రయాన్–2 మిషన్ చంద్రుడిపై దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకు గాను 8 నుంచి 10 వతరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపితే సరిపోతుంది.ఈ నెల 20వ తేదీ వరకే గడువు ఉంది.
సాక్షి, తిరుపతి : భారత సాంకేతిక ఎదుగుదలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇస్రో మై గౌ’ పేరుతో ఆన్‌లైన్ ప్రతిభా పాటవ పోటీలను నిర్వహిస్తోంది. దీనికి ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ఈ నెల 10 నుంచి ఆన్‌లైన్ క్విజ్ ద్వారా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రతిభ చూపి, ఎంపికైన విద్యార్థులు చంద్రయాన్–2 చంద్రుడిపై దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతో పాటు ప్రధాని మోదీతో కలిసి చంద్రయాన్–2 మిషన్ చంద్రుడిపై దిగే అపురూ పన్నివేశాన్ని వీక్షించవచ్చు. పోటీ ముగిశాక విజేతల వివరాలు వెల్లడిస్తారు. తగు ఆధారాలు, ద్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు.
పోటీ ఇలా..
కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇంటర్నెట్‌ను అనుసంధానం చేసుకుని IrsomYgov వెబ్‌సైట్లోకి వెళ్లగానే.. అక్కడ వివరాలు వస్తాయి. వీటిలో మొదటి కాలమ్‌గా వివరాలు, నియమ నిబంధనలు ఉంటాయి. రెండో కాలమ్‌గా లాగిన్ టు ప్లేక్విజ్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసి, కావాల్సిన వివరాలు నమోదు చేస్తే ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు ప్రారంభమవుతాయి. పది నిమిషాల వ్యవధిలో 20ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపకూడదు. స్క్రీన్‌పై కనిపించిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకుని తరువాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది. విద్యార్థికి పెద్ద వారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీల్లో పాల్గొనవచ్చు.
ఎంపిక ఎలాగంటే..
వేగం, కచ్చితత్వంతో పాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో సరైన సమాధానాలు నమోదు చేసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒకరికి సర్టిఫికెట్‌ను అందిస్తారు.
సువర్ణావకాశం సద్వినియోగం చేసుకోవాలి
చంద్రయాన్–2ను ప్రత్యక్షంగా సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్రమోదీతో కలసి చూసే సువర్ణావకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. 8వతరగతి నుంచి 10వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇటువంటి ఆన్‌లైన్ పోటీల్లో పాల్గొంటే విద్యార్థులకు మేధోశక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఈ అవకాశాన్ని కల్పించే విధంగా సహాయ సహకారాలు అందించాలి.
ఆర్.మణికంఠన్, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment